అదనపు కట్నం వేధింపులు.. ఉరేసుకుని వివాహిత బలవన్మరణం
పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను నిత్యం వేధించడంతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు మండలం బండనరసంపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ములుగు మండలం బండనరసంపల్లిలో ఘటన
దిశ, ములుగు : పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను నిత్యం వేధించడంతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు మండలం బండనరసంపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ములుగు ఎస్సై రంగ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కుంటోని గీత (36)కు దేవేందర్ తో 19ఏళ్ల క్రతం వివాహం జరిగింది. వారికి ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు.
వారు కొన్నేళ్లుగా గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో దేవేందర్ పూర్తిగా మద్యానికి బానిసై భార్య గీతను శారీరకంగా, మానసికంగా అదనపు కట్నం కోసం వేధించ సాగాడు. ఒకనోక సమయంలో ఆ వేధింపులను భరించలేక మృతురాలు గీత పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకొచ్చి భర్త దేవేందర్ కు ఇచ్చింది.
అయినా, దేవేందర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా గత 20 రోజుల నుంచి భార్య గీతను మళ్లీ పుట్టింటికి వెళ్లి అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గీత ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరికి చెప్పకుండా తమ వ్యవసాయ పొలంలో గల వేప చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. గీత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త దేవేందర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంగ కృష్ణ తెలిపారు.