గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి... తల్లిదండ్రుల ఆందోళన

తూప్రాన్ లోని మహాత్మా జ్యోతి బా పూలె బాలికల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి అస్వస్థత గురై ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది.

Update: 2023-03-27 10:44 GMT

ప్రిన్సిపాల్, వార్డెన్ల నిర్లక్ష్యంతోనే ప్రాణాలు పోయిందంటూ తల్లితండ్రుల ఆవేదన

దిశ, తూప్రాన్: తూప్రాన్ లోని మహాత్మా జ్యోతి బా పూలె బాలికల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి అస్వస్థత గురై ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. పెద్ద శంకరం పేట మండల పరిధిలోని కమలాపూర్ గ్రామానికి చెందిన సౌజన్య (13) 8వ తరగతి చదువుతోంది. ఈ నెల 22న జ్వరం రావడంతో హస్టల్ వార్డెన్లు టాబ్లెట్ ఇచ్చారు. అయినా, జ్వరం తగ్గకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులకు వారు సమాచారం అందజేశారు.

అనంతరం సౌజన్యను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. దీంతో మరింత తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి అస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ విషయంపై విద్యార్థిని బంధువులు పాఠశాల ప్రిన్సిపాల్ అర్షియా తరణ్మన్, వార్డెన్ నిర్లక్ష్యం వల్లే తమ అమ్మాయి మృతి చెందిందంటై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై పాఠశాల పిన్సిపల్ అర్షియాను వివరణ కోరాగా విద్యార్థిని జ్వరం విషయంలో తమ నిర్లక్ష్యం ఏమి లేదంటూ సమయానికి స్పందించి టాబ్లెట్లు ఇచ్చామని తెలిపారు. జ్వరం తగ్గపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందజేశామని ఆమె తెలిపారు. అనారోగ్య లక్షణాలు ఉన్న దాదాపు 25మంది విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో తూప్రాన్ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు.

పాటశాలను సందర్శించిన ఆర్సీవో..

విషయం తెలుసుకున్న ఆర్సీవో ప్రభాకర్ పాఠశాల సిబ్బంది, ప్రిన్సిపాల్ వార్డెన్లు, టీచర్లతో సమావేశమయ్యారు. అనారోగ్య లక్షణాలు ఉన్న అందరూ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఏదైనా సామాచారం ఉంటే తల్లిదండ్రులకు సమాచారం అందజేయాలని సూచించారు. భోజనం, ఇతర వసతుల పట్ల జాగ్రత్త వహించాలని వారికి సూచించారు.

తల్లిదండ్రుల ఆందోళన

విద్యార్థుల పట్ల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఏమాత్రం శద్ధ వహించడం లేదంటూ తల్లిదండ్రులు పాఠశాల ఎదుట బైఠాయించారు. తాము ఎన్ని సార్లు చెప్పనా.. వినకుండా వాళ్ల నిర్లక్ష్యం కారణంగా పిల్లల ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని.. అదేవిధంగా మృతురాలు బాలిక సౌజన్య కుటుంబాన్ని అందుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News