FTL Limits: ఎఫ్‌టీఎల్‌లో బహుళ అంతస్తులు.. కబ్జా చెరలో మల్కాపూర్ పెద్ద చెరువు

ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటలు, వాగుల ఆక్రమణలపై దృష్టి పెట్టింది.

Update: 2024-09-14 02:57 GMT

దిశ, సంగారెడ్డి/కొండాపూర్: ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటలు, వాగుల ఆక్రమణలపై దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ అక్రమార్కులపై ఉక్కపాదం మోపుతోంది. అయినా ఎలాంటి జంకు లేకుండా కొందరు ఆక్రమణదారులు యథేచ్ఛగా చెరువులను చెరబడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువు విస్తీర్ణం సుమారు 670 ఎకరాలు ఉండగా ఈ చెరువు నీటితో పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తున్నారు. అంతేకాకుండా ఓడీఎఫ్​లో తయారు చేసిన యుద్ధ ట్యాంకులను సైతం పరీక్షలు నిర్వహిస్తారు. ఇంతటి చరిత్ర ఉన్నఈ చెరువు కబ్జాకు గురైంది. కుతుబ్ షాయిపేట్ గ్రామ శివారులో 93 సర్వేనంబర్ లో ఉన్న ఈ చెరువు మూడు ఎకరాలమ ఎఫ్​ టీఎల్​​ భూమిని ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. పూర్తిగా ఎఫ్​ టీఎల్​ లోనే భవనాలు నిర్మించడమే కాకుండా అందులో స్విమ్మింగ్ ఫూల్, గెస్ట్ హౌజ్ నిర్మించారు. కొందరు రెవెన్యూ అధికారుల అండతో నిర్మాణాలు చేశారు. విషయం తెలిసినా కూడా అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

నిర్మాణాలపై చర్యలు శూన్యం..

మల్కాపూర్ పెద్ద చెరువు విస్తీర్ణంలోని సర్వే నంబర్ 93లో ఎఫ్‌టీఎల్​ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లుగా వదిలేశారు. గతంలో పనిచేసిన తహసీల్దార్ అక్రమ నిర్మాణాలకు సహకరించినట్లు పలువురు కుతుబ్ షాయిపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పెద్ద చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, అందువల్లే చెరువు కబ్జాకు గురైనట్లు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎఫ్​ టీఎల్​ లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం చుట్టూ పెద్ద ఎత్తున నీరు చేరింది.

అక్రమంగా భవనం నిర్మించిన యజమాని పూర్తిగా భవనం ఎఫ్​ టీఎల్​ ఉందనే విషయం తెలిసి భవనం చుట్టూ నీరు చేరినా కూడా భవనంలోకి వెళ్లేందుకు ప్రత్యేకం చిన్నపాటి బ్రిడ్జీని నిర్మించారు. భవనం పక్కనే గెస్ట్ హౌజ్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. భవనంలోకి పూర్తిగా నీరు నిండినా కూడా స్విమ్మింగ్ పూల్ నుంచి భవనంలోకి వెళ్లేందుకు చిన్న బ్రిడ్జి నిర్మించి భవనంలోకి వెళ్లారు. ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలకు అనుమతులు ఇవ్వరాదని తెలిసినా అధికారులు యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఎలా ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. అవినీతి అధికారుల అండదండలతో చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అక్రమ నిర్మాణాలలో వీకెండ్ రేవ్ పార్టీలు..

కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన బహుళ అంతస్తుల భవనంలో వీకెండ్ పార్టీలు జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రతి వారం వీకెండ్ పార్టీలతో పాటు రేవ్ పార్టీలు, బర్త్ డే పార్టీలు నిర్వహిస్తారనే సమాచారం. హైదరాబాద్ కు చెందిన పలువురు ప్రతి వారం ఇక్కడా పార్టీలు నిర్వహించుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. హైదరాబాద్ లో రేవ్ పార్టీలపై పోలీసులు చర్యలు తీసుకుంటుండడంతో జిల్లా కేంద్రమైన సంగారెడ్డి దగ్గరలో ఉండడం అదే విధంగా నేరుగా నేషనల్ హైవే ఉండడంతో ఇక్కడా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు గానీ, ఇరిగేషన్ అధికారులు గానీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదే విధంగా ఇక్కడాయథేచ్ఛగా రేవ్ పార్టీలు జరుగుతున్నా పోలీసులు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని కుతుబ్ షాయిపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రేవ్ పార్టీలు నిర్వహించుకునే సందర్బంలో పలువురు గ్రామస్తులతో గొడవలు కూడా జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఎఫ్​ టీఎల్​ లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Similar News