సింగూరుకు మళ్లీ పెరిగిన వరద.. సామర్థ్యానికి చేరువలో నీటిమట్టం

సింగూరు ప్రాజెక్టులోకి మళ్లీ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

Update: 2024-09-07 13:09 GMT

దిశ, ఆందోల్: సింగూరు ప్రాజెక్టులోకి మళ్లీ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, చేరువలో 29.499 టీఎంసీలకు చేరింది. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ప్రాజెక్టు లోని 4, 6 గేట్లను 1.50 మీటర్ల ఎత్తుతో దిగువకు నీటిని వదిలారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ప్రాజెక్టులోకి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో 4వ నంబర్ గెట్ ను మూసేసి, 6వ నంబర్ గెట్ ద్వారా దిగువకు వదిలారు.

ఇదిలా ఉండగా శనివారం ఉదయం నుంచి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో 11వ నంబర్ గెట్ ను ఓపెన్ చేయగా, 6వ గెట్ రెండు గేట్ల ద్వారా 18904 క్యూసెక్కుల, జెన్ కో ద్వారా 2764 క్యూసెక్కులు, మొత్తం 22069 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 11050 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 29.499 టీఎంసీలకు సామర్థ్యం చేరుకుంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో గేటును ఎత్తి దిగువకు నీటిని వదిలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా మంజీరా నది పరివాహక ప్రాంత ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చేపలు పట్టేందుకు జాలర్లు వెళ్లకూడదని వారు సూచించారు.


Similar News