ఆరిన అద్భుత ప్రతిభా దీపం..!

అద్భుత ప్రతిభ కలిగిన విద్యార్ధిని అనారోగ్యంతో మృత్యువాత పడింది.

Update: 2024-09-16 17:01 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : అద్భుత ప్రతిభ కలిగిన విద్యార్ధిని అనారోగ్యంతో మృత్యువాత పడింది. చదువుతో పాటు ఆటలు, నృత్యాలతో మంచి భవిష్యత్తు ఉన్న పదవ తరగతి విద్యార్థిని మృతి చెందడం పై పలువురు విషాదం వ్యక్తం చేసిన ఘటన హవేలీ ఘనపూర్ మండలం సర్ధనలో ఆదివారం రాత్రి జరిగింది. సర్ధన గ్రామానికి చెందిన పిల్లి కృష్ణ, భాగ్య దంపతులు మొదటి కుమార్తె పిల్లి వెంకటలక్ష్మి (వర్ష) స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ లో పదవ తరగతి చదువుతోంది. చదువులోనే కాకుండా స్పోర్ట్స్, భారత నాట్యంలో మంచి ప్రతిభ ఉన్న విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కళా ఉత్సవ్ లో క్లాసికల్ డాన్స్ ప్రదర్శన ఇచ్చి పలువురి ప్రశంసలు సైతం అందుకుంది. అలాగే ఆటల్లో సైతం పలు పథకాలు సాధించిన విద్యార్థిని గత కొన్ని రోజుల అనారోగ్యానికి గురైంది. తల్లిదండ్రులు హైదారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. అన్ని రంగాల్లో రాణిస్తూ మంచి ప్రతిభ కలిగిన విద్యార్థిని మృతి చెందడం పై ఉపాధ్యాయులు తీవ్ర సంతాపం ప్రకటించారు. వెంకటలక్ష్మి భవిష్యత్తులో మంచి స్థానంలో నిలిచేదని, కానీ మృత్యువు వెంటాడి తీసుకు వెళ్ళడం బాధగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలి : పీఆర్టీయూ

మంచి ప్రతిభ కలిగిన విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందడం పై పీఆర్టీయు తీవ్ర సంతాపం ప్రకటించింది. బాధిత విద్యార్థిని కుటుంబాన్ని రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని కోరారు. విద్యార్థి మృతి పట్ల మెదక్ జిల్లా పీఆర్టీయూ, హవేలీ ఘన్పూర్ పీఆర్టీయూ రాష్ట్ర జిల్లా మండల నాయకులు ఎస్.శ్రీనివాస్, సుంకరి కృష్ణ, ఎల్ మల్లారెడ్డి, రఘుబాబు, సుభాష్ రెడ్డి, సంగమేశ్వర్, సర్దన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, పోచయ్య, రాజేందర్ రెడ్డి, సంతోష్ కుమార్ వాళ్ళ కుటుంబానికి భగవంతుడు అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.


Similar News