ఎన్నాళ్లీ పడిగాపులు.. ఇంకా కల్లాల్లోనే వడ్లు

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి తిప్పలే... ఎలాగోలా అమ్మితే డబ్బులు బ్యాంకులో పడటం కష్టమే. వరి సాగు చేసిన రైతు కష్టాలు పడుతున్నారు.

Update: 2023-05-28 03:22 GMT

దిశ, దౌల్తాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి తిప్పలే... ఎలాగోలా అమ్మితే డబ్బులు బ్యాంకులో పడటం కష్టమే. వరి సాగు చేసిన రైతు కష్టాలు పడుతున్నారు. ఇంకా కల్లాల్లోనే వడ్లు కనిపిస్తున్నాయి. వర్షాలు వస్తే తడిసిపోతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్న ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ధాన్యం అమ్మి దాదాపు ఇరవై రోజులు దాటుతున్న డబ్బులు ఖాతాలో పడటం లేదని రైతులు వాపోతున్నారు. ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమకావడంలో జరుగుతున్న జాప్యంపై కొనుగోలు కేంద్రాల నిర్వహకులను సంప్రదించగా, రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నామన్నారు.

త్వరలోనే డబ్బులు జమవుతాయని, రైతులు తమ వివరాలు అందించడంలో కొంత జాప్యం జరుగుతోందని సమాధానం చెబుతున్నారు. తూకం వేసిన వెంటనే రైతులు వివరాలు అందజేయాలని వారు సూచిస్తున్నారు. లారీల కోసం ట్రాన్స్​పోర్టు అధికారులతో మాట్లాడగా ఈగ పంపిస్తున్నాం.. ఇంకా పంపిస్తున్నాం.. అంటూ చెబుతున్నారు. కానీ రోజుకు కనీసం ఒక్క గ్రామానికి డీసీఎం పంపించని పరిస్థితి నెలకొంది. రైతు ప్రైవేట్ గా వాహనాలు తెచ్చుకున్నట్లైతే సంచికి పది రూపాయలు చొప్పున డీసీఎం లారీ, ట్రాక్టర్లు దండుకుంటున్నారు. వెంటనే అధికారులు పట్టించుకోని కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించి ధాన్యాన్ని మిల్లులోకి పంపించాలని రైతులు వేడుకుంటున్నారు.

చర్యలు తీసుకోవాలి..

కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయగా ధాన్యం తూకం వేసి దాదాపు ఇరవై రోజులైంది. వానాకాలం పనులు ప్రారంభం అవుతున్నాయి. ఇంతవరకు ధాన్యం డబ్బులు జమ కాలేదు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి వెంటనే ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. - పంజా రమేష్, రైతు

పెట్టుబడికి పైసలు లేవు..

వడ్లు అమ్మి 20 రోజులు అయింది. పైసలు ఇంకా రాలేదు. రోహిణి కార్తె వచ్చింది విత్తనాలకు, పెట్టుబడికి పైసల కోసం చాలా ఇబ్బందిగా ఉంది. వడ్ల పైసల్ రాక వరి కోత మిషన్ల కిరాయి ఇంకా ఇయ్యాలే. పైసల కోసం కోత మిషన్ యజమానులు రోజు తిరుగుతుర్రు. –మహమ్మద్ షాపూర్ మల్లారెడ్డి రైతు

20 రోజులైంది.. అయినా కొంటలేరు..

నేను మూడెకరాల్లో వరి సాగు చేశాను. సమీపంలోని కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తెచ్చి 20 రోజులు అయింది. అయినా కొనుగోలు చేయడం లేదు. వర్షం ఎప్పుడొస్తుందో తెలియక కుప్పల వద్దే నిద్రపోతున్నా. అలాగే గోన సంచులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. – కురుమ ఎల్లయ్య, మహమ్మద్ షాపూర్

Tags:    

Similar News