రైతు దినోత్సవ వేడుకల్లో అపశృతి
మెదక్ రైతు దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది.
మెదక్ లో గాలికి కూలిన టెంట్, మాజీ వైస్ చైర్మన్ కు స్వల్ప గాయాలు
దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ రైతు దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈదురుగాలికి ఒక్కసారిగా టెంట్ కూలడంతో మున్సిపల్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్లకు పెద్ద ప్రమాదం తప్పగా.. వారకి స్వల్ప గాయాలైన ఘటన శనివారం మెదక్ పట్టణం రైతు వేదికలో చోటుచేసుకుంది. మెదక్ పట్టణ రైతు వేదిక వద్ద రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా రైతు దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అన్ని వార్డుల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేదికపై మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్ హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల క్షేమం కోసం చేపట్టిన పథకాలను రైతులకు వివరించి సమావేశాన్ని ముగించారు. కొంతమంది రైతులు భోజనం కోసం వెళ్లగా మరి కొంతమంది రైతులు మున్సిపల్ చైర్మన్ కు పలు సమస్యలు వివరిస్తుండగా ఒక్కసారిగా టెంట్ కూలిపోయింది. టెంట్ కు ఉన్న ఇనుప రాడ్డు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్ తలకు తాకడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. కొంత మంది రైతులకు కూడా స్వల్ప గాయాలు కాగా వారిని అక్కడి నుంచి ఇంటికి తరలించారు.