బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.. శాసనసభ స్పీకర్

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబీలో కూరుకుపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

Update: 2024-09-18 09:20 GMT

దిశ, కొల్చారం : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబీలో కూరుకుపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం రంగంపేటలోని మాధవానంద సరస్వతి ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి చతుర్మాస దీక్ష విరమణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జగదీశ్వర్ రెడ్డిలు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అలాగే వేదపండితులు పూర్ణకుంభంతో స్పీకర్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆశ్రమంలోని గురుపాదుకల వద్ద స్పీకర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశ్రమంలో మాధవానంద స్వామిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా మాధవానంద స్వామి స్పీకర్ ను శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం యజ్ఞ యాగాలు నిర్వహిస్తూ, శిథిల ఆలయాలను పునరుద్ధరిస్తూ నిర్విరామంగా ధర్మ పరిరక్షణ కోసం మాధవానంద సరస్వతి స్వామి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వామిని దర్శించుకోవడం రెండోసారి అని గతంలో ఒకసారి తొగుట ఆశ్రమంలో స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. శివరాత్రి పర్వదినం మరుసటి రోజు సెలవుగా ప్రకటించాలని స్వామి కోరినట్లు, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసని, ఈ అప్పుల ఊబి నుంచి బయటపడి కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలయ్యేలా ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు స్పీకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు నాగరాజు పంతులు, బండి సుజాత, రమేష్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ప్రభు లింగం, కొల్చారం తహశీల్దార్ గౌస్ మియా, ఆర్ఐ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News