Minister Ponnam Prabhakar : త్వరలోనే గౌరవెల్లి.. గండపల్లి ద్వారా సాగు నీరు..

త్వరలోనే గౌరవెల్లి, గండపల్లి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Update: 2024-08-09 14:19 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : త్వరలోనే గౌరవెల్లి, గండపల్లి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో అక్కన్నపేట మండలంలోని పోతారం (జే) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈత, తాటి మొక్కలు నాటారు. రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. అన్ని కులవృత్తులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోతారం జే సంఘం దేవాలయం కాంపౌండ్, భూమి సమస్య పరిష్కారం చేస్తానని వెల్లడించారు. అంతకు ముందు కోహెడ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ లో స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్టీల్ బ్యాంక్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

ఆధార్ అనుసంధానం చేసుకోవాలి..

రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా రూ.1 లక్షా 50 వేల రుణ మాఫీ చేసింది. ఇంకా రుణమాఫీ కాని వాళ్లు ఉంటే వ్యవసాయ అధికారులను కలవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన వ్యవసాయ అనుబంధ రంగాల పథకాల పై అవగాహన సదస్సుకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. గ్యాస్ సబ్సిడీ, రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు కాని పక్షంలో ప్రజాపాలన సేవ కేంద్రాల వద్ద ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. వాణిజ్య పంట డ్రాగన్ ఫ్రూట్, అయిల్ ఫాం తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలన్నారు.

పెరటి కోళ్లు, పట్టు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ప్రోగ్రాంలో రైతులకు గొర్రెలు, పెరటి కోళ్లు, మేకలు, గడ్డి పెంపకం రూ.20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఋణం 50 శాతం సబ్జిడీతో అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈజీఎస్ ద్వారా 12 రకాల పండ్ల తోటలు పెంచుకోవచ్చు అని తెలిపారు. 30 శాతం సబ్సిడీ పై పుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పాల శీతల కరణ కేంద్రం పెట్టుకోవచ్చు అన్నారు. రైతులు ఒప్పుకుంటే పొలాలకు రోడ్డు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్యా, జిల్లా వ్యవసాయ అధికారి ప్రభాకర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, పశు వైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News