బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి : ఎంపీ

కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయి.

Update: 2023-10-25 14:01 GMT

దిశ, దుబ్బాక: కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయి. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజల మధ్యకు తీసుకుపోవాలి. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలి. బీజేపీ నాయకుల కుట్రలను తిప్పికొట్టాలి.. అంటూ మెదక్ ఎంపీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులకు, ముఖ్య కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం దుబ్బాక మండల కేంద్రంలోని కోమటి రెడ్డి రజినీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా గంప నాగేశ్వరరావు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) చైర్మన్ గ్యాదరీ బాలమల్లు విచ్చేసారు. ఈ సభకు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ..ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలున్న పార్టీ బీఆర్ఎస్ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు. క్రమశిక్షణ గల బీఆర్ఎస్ పార్టీ సైనికులు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అయ్యేలా ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్‌ పార్టీ కార్యకర్తలే నా బలగం.. బలం అని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

కార్యకర్తలు లేనిదే మా లాంటి లీడర్లు లేరు. కార్యకర్తల శ్రమ కష్టం వల్లనే మేము గెలిచి ఐదేళ్లు పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తుంటాం. కానీ ప్రతి కార్యకర్తలకు రిటైర్మెంట్ ఉండదు. పార్టీనే నమ్ముకొని ఉంటూ మమ్మల్ని గెలిపించడానికి ఎంతో కష్టపడతారని అన్నారు. కార్యకర్తలు కూడా రాజకీయంగా ఎదగడానికి కూడా సహాయ సహకారాలు అందించడంలో ముందుంటా అన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు కావాలని కోరుకుంటా మీరు కూడా లీడర్లు కావాలి అన్నారు. అలాగే ఈ సారి ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పని చేస్తూ, ఉమ్మడి మెదక్ జిల్లాలో, మళ్లీ మూడో సారి కూడా మన బీఆర్ఎస్ పార్టీకి అత్యంత మెజారిటీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. దేశం లో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు అధికారులు వచ్చి మన రాష్ట్ర అభివృద్ధిని చూసి సంతోషపడుతున్నారు. పదేళ్లు ఎంపీ గా ఉన్నాను. సీఎం కేసీఆర్ నాకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఈ పదేళ్ళలో ఏ ఒక్క తప్పు కూడా చేయకుండా మీ ఆశీస్సులతో పని చేసాను. దుబ్బాక నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేయమని కేసీఆర్ ఈ సారి ఆదేశించారు. మళ్లీ మీ ఆశీస్సులతో గెలిచి ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను అన్నారు. చాలా మంది దుబ్బాక అభివృద్ధి కాలేదు అంటారు. కానీ సిద్ధిపేట, సిరిసిల్ల. గజ్వేల్ కంటే బ్రహ్మాండంగా దుబ్బాకని అభివృద్ధి చేసి ప్రభాకర్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తాను.




ఓట్ల కోసం నేను వాగ్దానాలు చేయట్లేదు. కచ్చితంగా ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 గా చేస్తా అని తెలిపారు. కాంగ్రెస్, బీజీపీ వాళ్ళ లాగా నేను అబద్దాలు చెప్పాను. ఏం చెప్తే అది చేస్తా మొన్నటి దాకా గజ్వేల్ ఇంచార్జ్ గా ఉన్నాను. ఇప్పుడు దుబ్బాక కూడా అభివృద్ధి చేస్తాను. ఆ బాధ్యత నాది. నన్ను భారీ మెజారిటీ తో గెలిపించండి. మీరు ఊహించిన దాని కన్నా వంద రేట్లు ఎక్కువ పని చేస్తాను అని చెప్పారు. కార్యకర్తలకు ఏం సమస్యలున్నా నేను చూసుకుంటాను. రాత్రి పగలు తేడా లేకుండా, మీకేం సమస్య ఉన్నా మీ బాధ్యత కూడా నేను తీసుకుంటాను అని హామీ ఇచ్చారు. అవతల వాళ్ళకి క్యాడర్ లేదు. లీడర్ లేడు. కేవలం వాట్సాప్ లల్లో మన మీద చెప్పడం తప్పించి వాళ్లేమి చేయలేరు. అందుకే మనం ఎటువంటి ప్రలోభాలకు, తాయిలాలకు లొంగకూడదు అని పార్టీ ప్రజా ప్రతినిధులకు, ముఖ్య కార్యకర్తలకు, నాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్ గన్నె వనిత భూంరెడ్డి, జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు పల్లె వంశీ కృష్ణ గౌడ్, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, నియోజకవర్గ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాల్గొన్నారు.

Tags:    

Similar News