ప్రజల ప్రాణాలపై నల్ల మట్టి వ్యాపారుల దందా

ప్రజల ప్రాణాలపై నల్లమట్టి వ్యాపారులు దందా నిర్వహిస్తున్నారని గుమ్మడిదల గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-07-10 10:38 GMT

దిశ, గుమ్మడిదల : ప్రజల ప్రాణాలపై నల్లమట్టి వ్యాపారులు దందా నిర్వహిస్తున్నారని గుమ్మడిదల గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే గుమ్మడిదల గ్రామానికి చెందిన సంజీవరెడ్డి అనే రైతు పక్కకి ఆగి ఉన్న సమయంలో నల్ల మట్టి టిప్పర్ వచ్చి అతడిని ఢీ కొట్టింది. దీంతో సంజీవరెడ్డి మృతి చెందాడు. ఈ ఘటన గడిచి వారం రోజులు కూడా గడవకముందే మరోసారి మండలంలో నల్లమట్టి టిప్పర్లు అతివేగంతో ప్రయాణిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 11 సమయంలో గుమ్మడిదల గ్రామ అంబేద్కర్ సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు మండల కేంద్రంలోని జాతీయ రహదారి కానుకుంట చౌరస్తా వద్ద భారీ సంఖ్యలో మట్టి టిప్పర్లను అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అతివేగంగా నడిచే ఈ నల్ల మట్టి టిప్పర్ల ప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం మండలంలో ముగ్గురు

    నుండి నలుగురు మృతి చెందుతున్నారని వాపోయారు. నిత్యం ఈ జాతీయ రహదారిపై ప్రయాణించే బస్సులు, లారీలు ఇతర వాహనాల కారణంగా జరగని ప్రమాదాలు కేవలం ఈ మట్టి టిప్పర్ల కారణంగానే ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ఒక్కరిపై ఒకరు పోటాపోటీగా వేల సంఖ్యలో ట్రిప్పులను తరలించడం. డ్రైవర్లకు విశ్రాంతి ఇవ్వకపోవడం కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఈ టిప్పర్ల కారణంగా ప్రజలు ప్రాణాలు నష్టపోతున్నా మట్టి వ్యాపారులు మాత్రం వారి బతుకులతోనే వ్యాపారం చేస్తున్నారని వాపోయారు. ఇంత జరుగుతున్నా

    ఏ ఒక్క అధికారి కూడా ఈ మట్టి టిప్పర్లను కట్టడి చేయలేకపోతున్నారంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ నల్ల మట్టి వ్యాపారులు ప్రజల ప్రాణాలను లెక్కలో ఉంచుకొని ఒక సమయ పద్ధతిలో వ్యాపారం నిర్వహించుకోవాలని, గ్రామాల్లో టిప్పర్లు జాగ్రత్తగా నడిపే విధంగా చూడాలని అన్నారు. లేకుంటే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల నాయకులు, సభ్యులు, గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News