జలదిగ్బంధంలో వన దుర్గమ్మ..ఏడుపాయల్లో మంజీరా పరవళ్లు

వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.

Update: 2024-10-23 12:29 GMT

దిశ,పాపన్నపేట : వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. మంజీరా నది పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూరు కు వరద వస్తుండడంతో ఆరవ గేటు ద్వారా దిగువకు నీటిని వదలడంతో వనదుర్గామాత ఆలయ సమీపంలో ఉన్న 30 శతకోటి ఘనపుటడుగుల వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొర్లుతోంది. దీంతో వనదుర్గ ప్రాజెక్టు పూర్తిగా నిండి 13000 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తుంది.

ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వన దుర్గామాత ఆలయం ముందున్న నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని గంగమ్మ చుట్టుముట్టింది. ఆలయ సిబ్బంది, అర్చకులు, పోలీసు సిబ్బంది వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురం లో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టగానే అమ్మవారి దర్శనం యథావిధిగా కొనసాగుతుందని వారు తెలిపారు.


Similar News