విద్యార్థుల భవిష్యత్తు ఆగం చేసేందుకు బీజేపీ కుట్ర: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
రాష్ట్రంలో జరుగుతున్న పేపర్ల లీకేజీ సూత్రధారి బండి సంజయ్ పనేనని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
దిశ, కంది: రాష్ట్రంలో జరుగుతున్న పేపర్ల లీకేజీ సూత్రధారి బండి సంజయ్ పనేనని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ కార్యకర్త ద్వారానే పదో తరగతి పరీక్ష పేపర్లను లీకేజీ చేశారని అన్నారు. విద్యార్థుల జీవితాలను ఆగం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని దుయ్యబట్టారు. తప్పు బీజేపీ పార్టీ నాయకులు చేసి.. ఆ నిందను బీఆర్ఎస్ పై మోపడానికి ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు.
28 రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చూసి మెచ్చుకుంటుంటే అది చూసి ఓర్వలేకే ఇలాంటి పనికి మాలిన చర్యలకు బీజేపీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. అదేవిధంగా జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కేవలం ఫోజులు ఇచ్చేందుకే పరిమితం అయ్యారని కౌంటర్ వేశారు. వెంటనే బండి సంజయ్ ఎంపీ సభ్యత్వం రద్దుచేసి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.