బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు..వర్గీకరణ హామీపై చిత్తశుద్దిని నిరుపించుకోవాలి

మాదిగ జాతి భవిష్యత్ కు ఉపయోగపడే పార్టీలకు అండగా నిలబడుతాం..ప్రమాదంగా మారిన వారిని రాజకీయంగా ఓడించే నిర్ణయం తీసుకుంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

Update: 2023-10-28 14:24 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: మాదిగ జాతి భవిష్యత్ కు ఉపయోగపడే పార్టీలకు అండగా నిలబడుతాం..ప్రమాదంగా మారిన వారిని రాజకీయంగా ఓడించే నిర్ణయం తీసుకుంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపుర్ లో మాదిగల విశ్వరూప మహాసభ జిల్లా సన్నాహక సమావేశం ఎమార్ఫీఎస్ జిల్లా అధ్యక్షుడు ముండ్రాతి కృష్ణ మాదిగ అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ...ఎస్సీ వర్గీకరణ హామీపై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చిత్తుశుద్ది నిరూపించుకోవాలన్నారు.

నవంబర్ 18న మాదిగల విశ్వరూప మహాసభ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో లక్షలాది మందితో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకున్న సమయంలో మహాసభ జరుగబోతుందన్నారు. మహాసభకు ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించాలని జాతీయ కమిటీ తీర్మానం చేసినట్లు తెలిపారు. ప్రధాని మోడీని ఓప్పించి రప్పించే బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దే అన్నారు.

ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంటే విశ్వరూప మహాసభ సాక్షిగా ప్రధాని నరేంద్రమోడీ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. వర్గీకరణకు అనుకూలమని కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పెట్టడంతో పాటుగా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు పార్టీ అనుకూలమని ప్రధాన మంత్రికి లేఖ రాయాలని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ను డిమాండ్ చేశారు. వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకపోతానని హామీ నిచ్చిన సీఎం కేసీఆర్ 6 ఏండ్లు అయిన నిలబెట్టుకోలేదన్నారు.

ఇప్పటికైనా వర్గీకరణకు సీఎం కేసీఆర్ తోడ్పాటు అందించాలన్నారు. ఎస్పీ వర్గీకరణతోనే పిల్లలకు చదువులు, ఉద్యోగాలు వస్తాయన్నారు. వర్గీకరణ జరగన్నంత కాలం ఏపార్టీ అధికారంలోకి వచ్చినా..అధికారం కోల్పోయిన ఓరిగేదేమిలేదన్నారు. ఎవ్వరినో ఓడించడానికో...గెలిపించడానికో తిరగడం కంటే జాతి బిడ్డల భవిష్యత్ కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విశ్వరూప మహాసభకు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు మైస రాములు, జిల్లా ఇంఛార్జి మాల్లిగారి యాదగిరి, ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులు యాదగిరి, నాగభూషనం, శ్రీనివాస్, కుమార్, బిక్షపతి, దుర్గయ్య, పర్ష రాములు, రాజు, ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News