వెలుగులోకి పురాతన ఆనవాళ్లు.. అరుదైన సిడి తల వీరగల్లు విగ్రహం లభ్యం

చాళుక్య రాష్ట్ర కూటుల కాలానికి చెందిన శిల్పాలు రాయపోల్ మండల

Update: 2024-07-03 14:55 GMT

దిశ, దౌల్తాబాద్ : చాళుక్య రాష్ట్ర కూటుల కాలానికి చెందిన శిల్పాలు రాయపోల్ మండల కేంద్రంలో గుర్తించబడ్డాయని తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు కొనిపాక శ్రీనివాస్ అన్నారు. బుధవారం శిల్పాలు శాసనాల పై ఉన్న రాతలను బట్టి నిర్ధారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండల కేంద్రంలో ఉన్న శిల్పాలను బట్టి అరుదైన సిడి తల వీరగల్లు గుర్తించడం జరిగిందన్నారు.

సిద్దిపేట జిల్లాలోని రాయపోల్ ఒక పురాతన నగరం. ఈ గ్రామంలోని గణపతి దేవాలయం దగ్గర కొన్ని విరిగిన వీరగల్లు విగ్రహాలు ఉన్నాయన్నారు. వాటిలో చాళుక్య, రాష్ట్రకూటుల కాలానికి చెందిన శిల్పాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రత్యేకమైన వీరగల్లు శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు గుర్తించడం జరిగిందన్నారు. ఈ శిల్పం ఆత్మాహుతి వీరగల్లుది అని నిర్ధారించడం జరిగింది. ఇలాంటి శిల్పాన్ని సిడితల వీరగల్లు అంటారు. రెండంతస్తులున్న ఈ వీరగల్లులోని మొదటి అంతస్తులో ఒక వీరుడు కూర్చుని ఉన్నాడు. ఆయన పట్టుకున్న పరికరమేదో అస్పష్టంగా ఉందని, వీరుని నడినెత్తిన కొప్పు ఉంది. వంచిన వెదురుగడకు తల తెగి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అంజలి పట్టిన వీరుడు ఆసన స్థితిలో కూర్చుని ఉన్నాడు. ఆత్మాహుతి చేసుకున్న వీరున్ని దేవలోకానికి తీసుకోనిపోతున్న ఇద్దరు చామరధారిణులైన అమరాంగనలు పై అంతస్తులో కనిపిస్తున్నారు.

ఇటువంటి శిల్పాన్ని సిడి తల వీరగల్లు అంటారు. ఇలాంటి సిడి తల వీరగల్లులు తెలంగాణా రాష్ట్రంలోనే పది మాత్రమే లభించాయన్నారు. స్త్రీ సిడి తల వీరగల్లులు చొల్లేరు, వనపర్తి గ్రామాలలో దొరికాయి. పురుష సిడితల వీరగల్లులు లింగంపల్లి, ఇప్పుడు రాయపోల్ లలో లభించాయి. శైవ భక్తులు ఆత్మబలిదానాలను ధర్మకార్యంగా, శివుని సన్నిధికి చేర్చే తక్షణ మార్గంగా ఎంచుకున్నారు. అందుకే ఈ ఆత్మాహుతులు జరిగాయి.

ఆ మధ్య వచ్చిన యుగానికి ఒక్కడు సినిమాలో కూడా ఇలాంటి శిల్పాన్ని పోలిన దృశ్యం ఒకటి మనకు కనిపిస్తుంది అన్నారు. అందులో చోళులు తిరిగి చోళనాడుకు వెళ్ళే సందర్భంలో ఎవరైనా బలిదానం చేయాలి అన్నపుడు ఒక వ్యక్తి తన తల వెంట్రుకలను వెదురుగడకు కట్టి కత్తితో ఇలానే నరుక్కొని బలిదానం చేసుకుంటారు. ఇలాంటి అరుదైన శిల్పాలు మన ప్రాంతంలో ఉండటం ఎంతో గర్వకారణంగా ఉందని రాయపోల్ ప్రజలు సంబరపడుతున్నారు.


Similar News