2,03,199 మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా రాలే... సీఎంఆర్ లెక్కల్లో గందరగోళం

కస్టమ్స్ మిల్లింగ్ రైస్ కోసం జిల్లా పెద్ద ఎత్తున ధాన్యం సేకరించి రైస్ మిల్లులకు అప్పగిస్తే తిరిగి వాటిని అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయి. ..

Update: 2024-07-06 03:23 GMT

దిశ, సంగారెడ్డి: కస్టమ్స్ మిల్లింగ్ రైస్ కోసం జిల్లా పెద్ద ఎత్తున ధాన్యం సేకరించి రైస్ మిల్లులకు అప్పగిస్తే తిరిగి వాటిని అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయి. 2022-23 యాసంగి, 2023-24 వానాకాలంసంగారెడ్డి జిల్లాలో మొత్తం 68 రైస్ మిల్లులు ఉన్నాయి. వాటికి యాసంగి 2022-23 వరిదాన్యం 1,67,290 మెట్రిక్ టన్నుల దాన్యం సేకరించి అందులో 113237మెట్రిక్ టన్నులు సీఎంఆర్ కు అప్పగించారు. అందులో సీఎంఆర్ కింద 65,743 మెట్రిక్ టన్నులు డెలివరీ చేయగా ఇంకా 47,494 మెట్రిక్ టన్నులు బ్యాలెన్స్ ఉంది. రెండు సంవత్సరాలు గడిచిపోయినా కూడా సీఎంఆర్ ప్రభుత్వానికి రైస్ మిల్లులు అప్పగించలేదు. అదే విధంగా 2023-24 వానాకాలంకు సంబంధించి 1,76,760 వరి దాన్యం సేకరించారు. అందులో సీఎంఆర్ కోసం 18,624 మెట్రిక్ టన్నులు అప్పగించారు. కాగా అందులో నుంచి 57,275 మెట్రిక్ టన్నుల రైస్ ను ఎఫ్ సీఐ కి సీఎంఆర్ డెలివరీ చేశారు. ఇంకా 61,349 మెట్రిక్ టన్నుల రైస్ బ్యాలెన్స్ ఉంది. 2023-24 యాసంగికి సంబందించి జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా 1,38,760 మెట్రిక్ టన్నుల వరిదాన్యం సేకరించారు. అందులో నుంచి 94,356 సీఎంఆర్ కు అప్పగించారు. కానీ వాటిని ఇప్పటి వరకు మర పెట్టలేదు. యాసంగి దాన్యం 94,356 మెట్రిక్ టన్నులు సీఎంఆర్ బ్యాలెన్స్ ఉంది.

అధికారుల నిర్లక్షంతో నెరవేరని సర్కారు లక్ష్యం..

సీఎంఆర్(కస్టమ్స్ మిల్లింగ్ రైస్) వ్యవహారంలో అధికారలుు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. 2022-23 సంవత్సరానికి రావలసిన బ్యాలెన్స్ సీఎంఆర్ రైస్ మిల్లుల నుంచి తెప్పించలేకపోయారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎంఆర్ గడువు ముగిసింది. కానీ సివిల్ సప్లై అధికారిక లెక్కల ప్రకారం 2022-23 కు సంబంధించి మార్చి 15, 2024 ప్రకారం ఇంకా జిల్లాలో 47,494 మెట్రిక్ టన్నుల బియ్యం గడువు ముగిసినా మిల్లర్లు కనీసం పట్టించుకోవడం లేదు. సీఎంఆర్ విషయంలో పౌరసరఫరాల శాఖ నిర్దేశించిన గడువు దిక్కరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి సీఎంఆర్ పూర్తి చేయాలి. కానీ రైస్ మిల్లర్లతో సివిల్ సప్లై అధికారులు మిలాఖత్ కావడంతో ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ సొమ్ముతో మిల్లర్లు అక్రమ దందా నడిపిస్తున్నట్లు పలు విమర్శిలు వెల్లువెత్తాయి. రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని రైస్ మిల్లులో తిరిగి రా రైస్ గా మార్చి ఎఫ్.సీఐకు తరలిస్తున్నారు. దీని కంతటికి జిల్లాలో రైతుల వద్ద సేకరించి మిల్లులకు తరలించిన దాన్యం లెక్కలు చూడడంలో అధికారుల అలసత్వం మిల్లర్లకు అక్రమ దందా చేసుకునేందుకు వీలు కలిగించింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 2022-23 నుంచి తీసుకుంటే ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు 2,03,199 మెట్రిక్ టన్నులు బియ్యం పెండింగ్ లో ఉంది. ప్రభుత్వం ఏప్రిల్ 2024 వరకు గడువు విదించినా అధికారులు మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో సీఎంఆర్ మిల్లుల నుంచి వస్తుంది..మన జిల్లాలో సీఎంఆర్ పెండింగే లేదంటున్నారు. అధికారులకు 2,03,199 మెట్రిక్ టన్నులు పెండింగ్ ఉండగా లేదని చెబుతున్నారంటే రైస్ మిల్లర్లకు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది.

రూ.కోట్ల విలువ చేసే బియ్యం పక్కదారి..

జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి రైస్ మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగిస్తే మిల్లర్లు రూ.కోట్ల విలువ గల దాన్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పకుండా పక్కదారి మళ్లిస్తున్నారు. సివిల్ సప్లై అధికారుల ఉదాసీనత వల్ల మిల్లర్లు ఇష్టారాజ్యంగా బియ్యాన్ని అమ్ముకుంటున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో 2,03,199 మెట్రిక్ టన్నులు పెండింగ్ లో ఉంది. కానీ అధికారులు పెండింగ్ లేదు. సంగారెడ్డి జిల్లా రైస్ మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వడంలో ముందున్నారని అధికారులు చెప్పడం పలు విమర్శలకు తావిస్తున్నది. 2022-23 సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉందనే విషయం సివిల్ సప్లై అధికారులు ఈ నెల 1వ తేదీన హైదరాబాద్ సివిల్ సప్లై కమీషనర్ కు నివేదికలు పంపించారు. వారికి పంపించిన రిపోర్ట్ లో జిల్లాలో 2,03,199 మెట్రిక్ టన్నులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. కానీ అందుకు భిన్నంగా జిల్లాలో రైస్ మిల్లర్లు సీఎంఆర్ అందించారని, వారు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని జిల్లా అధికారులు వారికి వంతపాడుతున్నారు. ఏప్రిల్ నెలలోనే గడువు ముగిసిపోయిన మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో అందిస్తారని రైస్ మిల్లర్లకు మద్దతు పలుకుతున్నారు. దీనిబట్టి రైస్ మిల్లర్లు ఇచ్చే తాయిలాలు ఆశపడి సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తు్న్నారు.


Similar News