భవనంపై నుంచి కింద పడిన విద్యార్థిని.. సంచలనంగా మారిన ఘటన..

రాయికొడ్‌ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ ఆ పాఠశాల

Update: 2024-07-08 12:03 GMT

దిశ,అందోల్‌ : రాయికొడ్‌ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ ఆ పాఠశాల భవనంపై కింద పడడం సంచలనంగా మారింది. తనను ఎవరో వెనకాల నుంచి కిందకు తోసేశారంటూ సదరు విద్యార్థిని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం రాయికొడ్‌ మండలం గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మల్లీశ్వరి అనే విద్యార్థినీ భవనంపై నుంచి కిందకు పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్ధినిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలుపడంతో సంగారెడ్డిలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. విద్యార్ధిని కాళ్లు విరిగి పోయినట్లుగా పాఠశాల వర్గాలు తెలిపాయి.

నన్ను ఎవరో తోసేసారు: గాయపడ్డ విద్యార్థిని మల్లీశ్వరి

గదిలో డబ్బులు తీసుకువద్దామని ఒక చెల్లి నాకు భయం అవుతుంది రూంకు రావా అని అడిగిందని, తనను బిల్డింగ్‌లోకి రమ్మని పిలిచి, నాకంటే ముందే ఆమె గదిలోకి వెళ్లిపోయిందని తెలిపింది. తాను భవనంపై ఉన్న బకెట్లపైకి ఎక్కి కిందకు చూస్తుండగా ఎవరో నా కాళ్లు పట్టి తోసేశారని, తాను గోడను పట్టుకొని కొద్ది సేపు వేలాడి, కిందకు పడిపోయానని చెప్పడం గమనార్హం. గాయపడిన మల్లీశ్వరీ చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విద్యార్థినీ మానసీక స్థితి బాలేదు: ప్రిన్సిపాల్‌ మాన్విచంద్‌

విద్యార్థిని మల్లీశ్వరీ మానసిక పరిస్థితి బాగాలేదని తల్లిదండ్రులు ముందే చెప్పారని పాఠశాల ప్రిన్సిపాల్‌ మాన్విచంద్‌ తెలిపారు. విద్యార్థులంతా కింద ఉంటే ఆ విద్యార్థిని ఒక్కతే పైకి ఎక్కిందని తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్, ఇతర పెద్దలు చెప్పటం వల్లనే ఆ విద్యార్థినిని పాఠశాలలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరో తోసేశారని వస్తున్న వార్తలపై ఆమె వివరణ ఇస్తూ ఈ సంఘటన విషయమై పూర్తి విచారణ జరగాలని స్థానిక పోలీసులకు లిఖిత పూర్వకంగా తెలియజేశామని, ఎంఈఓ ఇతర అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. తమ కూతురుకు గాలి సోకిందని, ఇబ్బందులు పెడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబితే ఆ విద్యార్థిని సంగారెడ్డిలోని మానసిక వైద్యలు డాక్టర్‌ మధు వద్దకు తీసుకువెళ్లి పరీక్షలు చేయించినట్లుగా తెలిపారు. గత నెల 22వ తేదిన పాఠశాలలో చేరినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు.


Similar News