MBBS ఫీజు నాలుగున్నరేళ్లకే.. స్టేట్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ క్లారిటీ

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థుల నుంచి ఫీజు వసూళ్లపై స్టేట్ రెగ్యులేటరీ కమిటీ స్పష్టత ఇచ్చింది.

Update: 2024-06-27 03:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థుల నుంచి ఫీజు వసూళ్లపై స్టేట్ రెగ్యులేటరీ కమిటీ స్పష్టత ఇచ్చింది. తొమ్మిది సెమిస్టర్లతో కూడిన నాలుగున్నరేళ్ల కోర్సుగా పరిగణించి ఆ మేరకే ఫీజు వసూలు చేయాలని, ఐదేండ్ల కాలంగా పరిగణించొద్దని నొక్కిచెప్పింది. ప్రతీ విద్యాసంవత్సరం ప్రారంభంలో ఆ సంవత్సరానికి సంబంధించిన ఫీజును మాత్రమే తీసుకోవాలని, అడ్వాన్సు పద్ధతిలో తీసుకోవద్దని పేర్కొన్నది.

మొత్తం నాలుగున్నరేళ్ల కాలానికి ఎంత ఫీజు అవసరమవుతుందో లెక్కలేసి దాన్ని ఐదు సమ వాయిదాల్లో వసూలు చేయాలన్నది. గత ప్రభత్వంలో 2016-17, 2017-18 విద్యా సంవత్సరాలకు ఐదేండ్ల కాలంగా పరిగణించి ఫీజును వసూలు చేయాలని జీవో (నెం. 126/12.9.2016, 120/20.7.2017) జారీచేసినా ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు 2021-23 విద్యా సంవత్సరాలకు ప్రభుత్వం సవరణలు చేసి జీవో (నెం. 5/27.1.2022) నాలుగున్నరేళ్ల కాలానికి దాన్ని కుదించిందని కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వం నుంచి జీవో వెలువడగానే దానికి తగినట్లుగానే తొమ్మిది సెమిస్టర్ల లెక్కలో మొత్తం నాలుగున్నరేళ్ల కోర్సుకు మాత్రమే ఫీజు వసూలు చేయాలని కమిటీ తరపున అన్ని ప్రైవేటు కాలేజీలకు సర్క్యులర్ (16.11.2022న) జారీ చేసినట్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గుర్తుచేశారు. ఐదు సమ వాయిదాల్లో విద్యార్థుల నుంచి వసూలు చేయాలని, కానీ నాలుగున్నరేళ్లకు అయ్యే ఫీజునే ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. ఉదాహరణకు ఎంబీబీఎస్ కోర్సుకు ఒక కాలేజీ వార్షిక ఫీజును రూ. 14.50 లక్షలుగా ఫిక్స్ చేస్తే నాలుగున్నరేళ్లకు అది రూ. 65.25 లక్షలు అవుతుందని, దీన్ని ఐదు సమ వాయిదాల్లో ప్రతీ విద్యాసంవత్సరం ప్రారంభం సమయంలో రూ. 13.05 లక్షల చొప్పున కట్టించుకోవాలని వివరించారు. ఇలా సమ వాయిదాలు చేయడం వల్ల విద్యార్థులపై ఫీజు భారం తగ్గుతుందన్నారు.

ఇప్పటికే కోర్సులో చేరి ఫెయిల్ లేదా డీటెయిన్ అయిన విద్యార్థులకు వార్షిక ఫీజును చెల్లించినందున వారి నుంచి మళ్లీ ఫీజు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు మెడికల్ కళాశాలలు ఈ నిబంధనను పాటించాలని, నాలుగున్నరేళ్ల కాలానికి మాత్రమే ఫీజును వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఇటీవల పలు కాలేజీలు ఐదేండ్ల ఫీజును వసూలు చేస్తున్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఈ స్పష్టత ఇవ్వడం గమనార్హం.


Similar News