Manchu Manoj: మోహన్‌బాబు ఇంటి వద్ద జర్నలిస్టుల ఆందోళన.. కన్నీళ్లుపెడుతూ మనోజ్ కీలక వ్యాఖ్యలు
కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు (Mohan Babu) భౌతిక దాడికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు (Mohan Babu) భౌతిక దాడికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సందర్భంగా మెహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ ఆయన ఇంటి ఎదుట జర్నలిస్టులు (Journalists) ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన మంచు మనోజ్ (Manchu Manoj) జర్నలిస్టుల ఆందోళనకు మద్దతు తెలిపి మీడియాపై దాడిని ఖండించారు. తండ్రి మోహన్ బాబు (Mohan Babu)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కన్నీళ్లు పెడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు తన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని అన్నారు. మీడియా మిత్రులకు అండగా ఉంటానని.. తన నాన్న తరుఫున తాను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.
తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. తాను ఇంట్లో ఎలాంటి డబ్బు, ఆస్తులు ఆడగడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్య 7 నెలలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా బాధలు అనుభవించిందని తెలిపారు. చివరికి తన బంధువులపై కూడా దాడి చేశారని మనోజ్ (Manoj) ఆరోపించారు. వివాదాల పరిష్కారం కోసమే వినయ్ (Vinay)కి మెసేజ్ చేశానని.. నా మెజేస్‌కి అతడు దురుసుగా రిప్లై ఇచ్చాడని పేర్కొన్నారు. వివాదాలు సద్దుమణిగేందుకు అవసరం అయితే అందరి కాళ్లపై పడతానని తెలిపారు. ఇన్నాళ్లు ఓపికతో భరించానని.. ఇక ఆగేది లేదన్నారు. అన్ని విషయాలు సాయంత్రం మీడియాకు చెప్పే ప్రయత్నం చేస్తానని తెలిపారు. తన నాన్న దేవుడని.. ఇది వరకు ఇలా ఉండేవాడు కాదని.. ఈ నాన్న.. తన నాన్న కాదని మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.