TPCC Chief: గవర్నర్ అనుమతి ఇచ్చాక అక్రమ కేసు ఎలా అవుతుంది?
కేటీఆర్(KTR)పై ఫార్ములా ఈరేస్(Formula-E race) కేసు సక్రమమే అని టీపీసీసీ(TPCC) చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్(KTR)పై ఫార్ములా ఈరేస్(Formula-E race) కేసు సక్రమమే అని టీపీసీసీ(TPCC) చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఫార్ములా ఈ-రేసులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమే అన్నారు. అక్రమాలు జరిగినట్టు ఆధారాలున్నా.. కడిగిన ముత్యమంటూ కేటీఆర్ తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పంపిన ఆధారాలపై గవర్నర్ న్యాయసలహా తీసుకొని కేసుకు అనుమతించిన తర్వాత ఇది అక్రమ కేసు ఎలా అవుతుంది..? అని అన్నారు. చట్టపరంగా కేసు నమోదు అయినందున దీనిపై అసెంబ్లీలో కాదు.. కోర్టులో తేల్చుకోవాలని తెలిపారు.
హెచ్‌ఎమ్‌డీఏ(HMDA) భాగస్వామ్యం కాకున్నా.. దాని ఖాతా నుండి ఆర్థికపరమైన అనుమతులు లేకుండానే రూ.54.88 కోట్లు చెల్లించేలా కేటీఆర్(KTR) ఒత్తిడి తెచ్చారని అన్నారు. ఆధారాలు కనిపిస్తున్నా.. అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం లాగా తాము అక్రమ కేసులు పెట్టట్లేదని అన్నారు. రేసింగ్ స్కాంలో నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకునే అధికారులు ముందుకెళ్తున్నారని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు ఫండ్స్ మంజూరు ఎలా చేస్తారని ప్రశ్నించారు. హద్దుల్లేని కేటీఆర్ అక్రమాలతో అధికారులు బలిపశువులుగా మారారని కీలక వ్యాఖ్యలు చేశారు.
నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో విదేశాల నిధులు బదిలీ చేయడంతో హెచ్‌ఎండీఏ ఆదాయ పన్ను శాఖకు రూ.8 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. నిబంధనలను కాదని మూడేళ్లలో రూ.600 కోట్లు చెల్లించేలా ఒప్పందం కేటీఆర్ అనుమతితోనే జరిగింది. నిబంధనలను అతిక్రమించి ప్రజలను ఇబ్బంది పెట్టడం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచడమా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల దోపిడీతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని అన్నారు. కేసులో అధికారులకు సహకరించాల్సిన కేటీఆర్ అహంకారంతో విర్రవీగుతూ, ఉద్యమకారులం భయపడం అంటూ కేసుకు సంబంధంలేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.