మల్లారెడ్డి vs మైనంపల్లి.. మల్కాజిగిరిలో ఫ్యామిలీ లొల్లి

షెడ్యూల్ వెలువడటంతో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల హీట్ మొదలవగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మాత్రం ఫ్యామిలీ పాలి‘ట్రిక్స్’ సాగుతున్నాయి.

Update: 2024-03-19 08:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : షెడ్యూల్ వెలువడటంతో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల హీట్ మొదలవగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మాత్రం ఫ్యామిలీ పాలి‘ట్రిక్స్’ సాగుతున్నాయి. పార్టీల మధ్య ఫైట్ కంటే మాజీ మంత్రి మల్లారెడ్డి, మైనంపల్లి కుటుంబాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ వైపు బీజేపీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు మాత్రం వ్యక్తిగత అంశాలపైనే సై అంటే సై అంటుండటంపై రెండుపార్టీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

రోహిత్ రావు VS భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి...

ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాన్ని అక్రమంగా నిర్మించారంటూ అధికారులు ఇటీవలే పాక్షికంగా కూల్చివేశారు. ఈ వివాదం నడుస్తుండగానే మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో వసతులు లేవని ప్రశ్నించినందుకు టార్గెట్ చేస్తున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న నిరసనకు దిగారు. యూనివర్సిటీకి వచ్చిన మైనంపల్లి హనుమంతరావు విద్యార్థులకు మద్దతు తెలిపారు. దీంతో మైనంపల్లి తీరుపై మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా వీరిపై మైనంపల్లి హనుమంతరావు కుమారుడు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోచుకుని దాచుకున్న ప్రతిపైసా బయటకు తీస్తామని, ఇక మల్లారెడ్డి అక్రమాల ఆటలు సాగవని ఫైర్ అయ్యారు.

ఇలాగైతే గెలవడం ఎలా?

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తుండగా, బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు సరైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మల్లారెడ్డి, మైనంపల్లి ఇలా పర్సనల్ ఎజెండాతో పాలిటిక్స్ కొనసాగించడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

మల్లారెడ్డి కాలేజీలో ఐటీ రెయిడ్స్!

తాజాగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఐటీ రెయిడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారు జాము నుంచే కాలేజీకి చేరుకున్న అధికారులు 4 గంటలుగా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాలేజీ మేనేజ్‌మెంట్, సిబ్బందిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. సోదాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News