ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంది : రైతు కమిషన్
ఆదివాసి రైతులతో బహుళ జాతి కంపెనీల విత్తన సాగు దందాపై ములుగు జిల్లా కలెక్టరేట్ లో వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ మంగళవారం విచారణ చేపట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఆదివాసి రైతులతో బహుళ జాతి కంపెనీల విత్తన సాగు దందాపై ములుగు జిల్లా కలెక్టరేట్ లో వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ మంగళవారం విచారణ చేపట్టింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బాధితు రైతుల సమస్యలను నేరుగా తెలుసుకొని, అధికారులు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. నిపుణుల కమిటీ పర్యటనలో పరిశీలించిన అంశాలను అధికారుల ముందు ఉంచి వివరాలు రాబట్టారు. అనంతరం మొక్కజొన్న సాగు బాధిత రైతులతో కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు ఉండే విత్తన హక్కు కంపెనీల పరమై వారి హక్కులకు భంగం కలిగిందన్నారు. భూమి హక్కులు తిరిగి రైతులకు చెందేలా భూ భారతి చట్టం తీసుకొస్తాన్నమన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ రైతుల రికార్డులను అమెరికా కంపెనీకి అప్పజెప్పిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి భూహక్కుల రికార్డులను ఎన్ఐసీకి అప్పజెప్పిందన్నారు. విత్తనం విషయంలో విత్తన నియంత్రణ , విత్తన ధర నిర్ణయంలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు అన్ని వ్యవస్థలు బాధ్యతగా విధులు నిర్వహించాయి.
కల్తీ విత్తనాలపై, విత్తన ధర నిర్ణయంలో ఆయా వ్యవస్థలు బాధ్యతగా పని చేశాయన్నారు. 2014 నుండి 2023 వరకు పదేళ్ల కాలంలో కంపెనీల అధిపత్యం పెరిగి బహుళ జాతి సంస్థలు విచ్చలవిడిగా రైతుల చేత విత్తనోత్పత్తి చేయించి రైతులను ఆర్దికంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కంపెనీలు కోట్ల రూపాయలు సంపాదించాయనే దానికి నిదర్శనమే ములుగు జిల్లా అని పేర్కొన్నారు. కలెక్టరేట్ లో బాధిత రైతులు, కంపెనీల ప్రతినిధులు, కంపెనీ గుప్పిట్లో ఉన్న ఆర్గనైజర్లు, అన్ని శాఖల అధికారులతో పాటు ఐటిడిఎ చర్చించిన కమిషన్ ఒక నిర్దిష్టమైన పాలసీ రాష్ట్రానికి మొత్తానికి వర్తించే విధంగా, నిపుణులతో సంప్రదించి అతి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందన్నారు. రైతులకు న్యాయం జరగాలి, ఆర్థిక ఇబ్బందుల నుండి రైతులు బయటపడాలి.1/70 ఆదివాసి ఏరియాలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అడుగడుగునా కమిషన్ దృష్టికి వచ్చాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని , అతి తొందరలోనే కమిషన్ కార్యాలయంలో నిపుణులు, మేధావులతో చర్చించి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఈకార్యక్రమంలో సభ్యులు కెవియన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, రాములు నాయక్, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు రామాంజనేయులు, సామాజికవేత్త దొంతి నరసింహారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.