400 ఎకరాల భూమిని ఆక్రమించలేదు: మంత్రి శ్రీధర్ బాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని 2003లో క్రీడా సౌకర్యాల అభివృద్ధి పేరిట ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్‌‌కు కేటాయించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీదర్​బాబు తెలిపారు.

Update: 2025-03-25 17:23 GMT
400 ఎకరాల భూమిని ఆక్రమించలేదు: మంత్రి శ్రీధర్ బాబు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని 2003లో క్రీడా సౌకర్యాల అభివృద్ధి పేరిట ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్‌‌కు కేటాయించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీదర్​బాబు తెలిపారు. ఆ సంస్థ ప్రాజెక్టును ప్రారంభించలేదని, 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించి కేటాయింపును రద్దు చేసిందని తెలిపారు. మంగళవారం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెం. 25లో ఉన్న 400 ఎకరాల భూమి గురించి వచ్చిన ప్రచారం వక్రీకరించేలా ఉందని ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వివరిస్తూ ఐఎంజీ అకాడమీస్ ఈ కేటాయింపు రద్దుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 07 మార్చి 2024 న హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.

దానిపై ఆ సంస్థ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసిందని, 03 మే 2024న సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్‌లు రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఈ 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా ధృవీకరించారని, ఈ భూమికి అటవీ శాఖకు ఏ సంబంధం లేదని, ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమిని కొత్త భూ కేటాయింపు విధానం ప్రకారం టీజీఐఐసీకి కేటాయించడానికి రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ అప్పగించింది. టీజీఐఐసీ అభివృద్ధి చేస్తున్న 400 ఎకరాల భూమిలో బఫెలో లేక్, పికాక్ లేక్‌లు లాంటి ప్రకృతి ప్రదేశాలు లేవని స్పష్టం చేసిందన్నారు.

ఈ భూమిలోని రాతి నిర్మాణాలు, పుట్టగొడుగు ఆకారపు అపురూపమైన రాయిని గ్రీన్ జోన్‌గా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పర్యావరణ పరిరక్షణ ప్రణాళికను కూడా సిద్ధం చేసి అమలు చేయనుందన్నారు. టీజీఐఐసీ హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూమిని ఆక్రమించలేదని, అలాగే నీటి వనరులను రాతి నిర్మాణాలను తొలగించలేదన్నారు. ప్రభుత్వ భూమిలో, టీజీఐఐసీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ అభివృద్ధి, సుస్థిర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని అభివృద్ధి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.ఈ భూమిలో ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ కోసం టెండర్లను ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేస్తోందన్నారు.

Tags:    

Similar News