TG Govt.: కేబినెట్ విస్తరణపై వచ్చిన క్లారిటీ.. ఆ రోజునే మంత్రుల ప్రమాణస్వీకారం!
వచ్చే నెల 3న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే నెల 3న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు ప్రచారం జరుగుతున్నది. ఉగాది పండుగ తెల్లారి (ఈ నెల 31)న మంచి ముహూర్తం ఉన్నదని, కానీ ఆ రోజున రంజాన్ పండుగ ఉండటంతో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం చేపడితే ఎలా ఉంటుందనే కోణంలో పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. మరోవైపు అసెంబ్లీ లాబీల్లో మంగళవారం కేబినెట్ విస్తరణపైన జోరుగా డిస్కషన్ జరిగింది. ఏ ఇద్దరు సభ్యులు కలిసినా ఇదే అంశంపై డిస్కస్ చేశారు. అధికార పార్టీ సభ్యుల మధ్య కాకుండా బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సైతం ఇదే అంశంపై చర్చించుకున్నారు.
శాఖల కేటాయింపుపై డిస్కషన్
కేబినెట్ విస్తరణలో బెర్త్ ఖాయం అనే నమ్మకంతో ఉన్న ఆశావహులు అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే సహచర ఎమ్మెల్యేలు వారిని అభినందనలతో ముంచెత్తారు. ప్రమాణ స్వీకారం చేసే వరకు గ్యారంటీ లేదని, ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని ఆశావహులు కామెంట్ చేశారు. ఎవరికి ఏయే శాఖలు ఇస్తారు? కొత్త మంత్రులకు ప్రస్తుతం సీఎం రేవంత్ వద్ద ఉన్న శాఖలను కేటాయిస్తారా? ప్రస్తుత మంత్రుల్లో ఒక్కొక్కరి వద్ద రెండు, మూడు శాఖలు ఉండటంతో వాటిల్లోంచి కొన్నింటిని అప్పగిస్తారా? అని ఆరా తీశారు.
హోంశాఖపై రాజగోపాల్ రెడ్డి కన్ను
బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే సమయంలో తమకు మంత్రి పదవులు ఇస్తామని హస్తం పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని, ఈ సారి తమకు పదవులు పక్కా అనే ధీమాలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు లాబీల్లో కనిపించిన వెంటనే ‘కంగ్రాట్స్ మంత్రి పదవి వస్తుందట కదా!’ అని తోటి సభ్యులు అభినందనలు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం ‘నాకు హోంశాఖ అంటే చాలా ఇష్టం’ అని తన కోరికను బహిర్గతం చేశారు. ‘ఎమ్మెల్యేల కెపాసిటీ మేరకు మంత్రి పదవులు ఇవ్వాలి. ఏ పదవి ఇచ్చినా ప్రజల పక్షన పనిచేస్తా. సమర్ధవంతంగా నిర్వహిస్తా’ అని తెలిపారు. వివేక్ కనిపించిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన్ను చుట్టుముట్టి కంగ్రాట్స్ చెప్పారు. వాకిటి శ్రీహరి, మల్‌రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్, ప్రేమ్ సాగర్ రావుకు సైతం అభినందనలు తెలిపారు.
ముందు రోజు సీఎం నుంచి ఫోన్లు
కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే వారి జాబితాను అధిష్ఠానం ప్రకటనకు ఒక రోజు ముందుగా సీఎం రేవంత్‌రెడ్డికి అందించనున్నట్టు తెలిసింది. అలాగే ఎవరికి ఏయే శాఖలు ఇవ్వాలో వారే డిసైడ్ చేస్తారని సమాచారం. విస్తరణ ముహూర్తం ముందు రోజు రాత్రి కొత్తగా మంత్రులయ్యే వారికి సీఎం ఫోన్ చేసి కేబినెట్‌లోకి రావాలని ఆహ్వానం పలుకుతారని పార్టీ వర్గాల్లో టాక్.