ఇదెక్కడి ఘోరం అయ్యా..

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలైన ఘటన హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిలోని తుమ్మలూరు గేట్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.

Update: 2023-02-11 10:34 GMT

ఒకే ప్రమాదంలో నలుగురు దుర్మరణం

దిశ, వెల్దండ: రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలైన ఘటన హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిలోని తుమ్మలూరు గేట్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతెపల్లికి చెందిన కేశవులు, శ్రీను, యాదగిరి మరియు లింగారెడ్డిపల్లికి చెందిన రామస్వామి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో రోదనలు మిన్నంటాయి. ఏకకాలంలో నలుగురు ఓకే ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమని గ్రామస్థులు వాపోయారు. పెళ్లిళ్లు సీజన్ రాగానే శుభకార్యాల్లో వంటలు చేస్తూ జీవనం కొనసాగించే వారు. అతి చిన్న వయసులో వారందరూ మృతి చెందడం చాలా బాధాకరమని పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో పోతపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్సీ కసిరెడ్డి

రోడ్డు ప్రమాదంలో మరణించిన వెల్దండ మండలం పోతెపల్లికి చెందిన కేశవులు, శ్రీను, యాదగిరి మరియు లింగారెడ్డిపల్లికి చెందిన రామస్వామిల పార్థీవ దేహాలకు శనివారం ఎమ్మెల్సీ శ్రీ కశిరెడ్డి నారాయణ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రతి కుటుంబానికి రూ.10 వేలు చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వ పరంగా మరియు తమ విద్యాసంస్థ తరపున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ వెంట జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, సర్పంచ్ లు, సంజీవ, తదితర మండల ముఖ్య నాయకులు ఉన్నారు.

మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారమివ్వాలి: తల్లోజు ఆచారి

తుమ్మలూరు గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో మృతి చెందిన నలుగురు కుటుంబాలను తల్లోజు ఆచారి పరామర్శించారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ మండలాధ్యక్షులు యెన్నం విజేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ యెన్నం శేఖర్ రెడ్డి ,లీగల్ సెల్ రాష్ట్ర సభ్యులు కృష్ణయ్య, సీనియర్ నాయకులు నక్కెరకంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దువ్వాసి రామస్వామి, జిల్లెళ్ల జంగయ్య, రహమతుల్లా, శశిధర్ రెడ్డి, తంబాలు, మట్ట విష్ణు, రామస్వామి, మట్ట శ్రీనివాస్, కొండల్, శ్రీశైలం, గ్రామ నాయకులు, తదితరలు ఉన్నారు. 

Tags:    

Similar News