Breaking News : మాగనూర్ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్

నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది.

Update: 2024-11-26 11:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ /మక్తల్ /మాగనూర్  : నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన 40 విద్యార్థులకు వాంతులు అయి, తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక దవఖానలో పలువురు విద్యార్థులను.. మక్తల్ కు పలువురిని చికిత్స కొరకు పంపించినట్లు తెలుస్తుంది. నేడు మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులకు వంకాయ, సాంబార్ తో కూడిన ఆహారాన్ని అందించారు. తిన్న కాసేపటికి విద్యార్థులకు తలనొప్పి, విరోచనాలు, కడుపునొప్పి అంటూ బాధపడ్డారు. ఎమ్మార్వో తో పాటు పలువురు పాఠశాలలో భోజనం చేసిన వారికి ఏమి కాలేదని విద్యార్థులకు మాత్రమే ఇలా జరిగినట్లు తెలుస్తుంది..

కాగా ఈనెల 20న ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 100 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. ఈ ఘటనపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యి.. మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారితోపాటు పలువురుని సస్పెండ్ చేయగా.. మరికొంతమంది ఉన్నతాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ స్వయంగా పాఠశాలను సందర్శించి.. విచారణ చేపట్టి, వంట ఏజెన్సీని తొలగించారు. ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేకపోగా.. నేడు మరోసారి అదే పాఠశాలల్లో సీన్ రిపీట్ అయింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మక్తల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు.  


Similar News