అందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తాం: ఎమ్మెల్యే జీఎంఆర్

పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ సంక్షేమ ఫలాలను అందిస్తామని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూధన్ రెడ్డి అన్నారు.

Update: 2024-01-13 15:34 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ సంక్షేమ ఫలాలను అందిస్తామని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూధన్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ పాలకులు తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే వారి పథకాలను వర్తింపజేశారని, మరి కొందరికి డబ్బులకు అమ్ముకున్నారని ఆయన విమర్శించారు. తాము ఎందుకు ఓడిపోయామో, కారణాలేంటి అని సమీక్షించుకోకుండా, నెల రోజుల తమ పాలన పై దుష్ప్రచారం మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. ప్రజాభిప్రాయం మేరకు రాష్ట్రంలోని జిల్లాలను కుదిస్తామని తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారే తప్ప, బీఆర్ఎస్ నాయకులాగా నిరంకుశ నిర్ణయాలను తీసుకోమని అన్నారు. ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని, నియంత పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.

తమ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి చోటు లేదని, ఇంత కాలం పార్టీని నమ్ముకుని పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. గతంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వేముల గ్రామం తో పాటు వివిధ గ్రామాల్లో నల్ల మట్టి తరలించి 40 కోట్ల రూపాయల దోపిడీ చేశారని, మైనింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులతో విచారణ చేయించి డబ్బులు రికవరీ చేయిస్తామని జీఎంఆర్ వెల్లడించారు. అలాగే పాలమూరు పట్టణంలో అభివృద్ధి పేర కోట్ల రూపాయలు, భూములు స్వాహా చేశారని వీటంనింటిపై విచారణ జరిపించి చట్టపరంగా చర్యలు చేపడతామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టిపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, మల్లు నరసింహ రెడ్డి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News