పర్యాటక, పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ఆవిష్కరిస్తాం
తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ఱారావు అన్నారు.
దిశ, కొల్లాపూర్ : తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ఱారావు అన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణకు పర్యాటకులను ఆకర్శించడం, పర్యాటకుల, ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా తెలంగాణను ఆవిష్కరించడమే లక్ష్యమని అన్నారు. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డబుల్ ట్రీ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ టూరిజం రోడ్ షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, విదేశీ ప్రతినిధులు, పర్యాటకులు, అక్కడి అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సంప్రదాయం, ఆధునికత రెండింటి కలబోత తెలంగాణ అని మంత్రి అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల జీవన విధానాలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, పండుగలు పర్యాటకుల మనసును దోచుకుంటాయని తెలిపి అంతర్జాతీయ పర్యాటకులను తెలంగాణ రాష్ట్రానికి మంత్రి ఆహ్వానం పలికారు. పర్యాటకంతో పాటు తెలంగాణలో పెరుగుతున్న పెట్టుబడుల అవకాశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం దేశంలో మినీ ఇండియాగా ప్రసిద్ధి పొందిందని, ఆ నగరం ప్రపంచ స్థాయి ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఎదిగిందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ గురించి పరిచయం చేస్తూ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఐటీ, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో అద్భుతమైన పెట్టుబడులు కల్పించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. ప్రకాష్ రెడ్డి, సాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా కాన్సుల్ జనరల్ చిట్టిరెడ్డి శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు.