ఆటల్లో రాణించి దేశం పేరు నిలబెట్టాలిః కలెక్టర్ బీఎం సంతోష్

Update: 2024-08-29 06:21 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : చిన్నతనం నుంచే చదువుతో పాటు క్రీడల్లో రాణించి దేశానికి ప్రాతినిధ్యం వహించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఇండోర్ స్టేడియంలో జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని హాకీ దిగ్గజం స్వర్గీయ మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. క్రీడలలో పాల్గొనడం విద్యార్థులకు శారీరక, మానసిక ఆరోగ్యం దృఢంగా ఉండేందుకు సహకరిస్తుందని, అలాగే క్రీడలు రోజువారీ జీవితంలో భాగంగా ఉండాలన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తితో యువత హాకీ వంటి క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలన్నారు. 1928, 1932, 1936 ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాలు గెలిచిన ధ్యాన్ చంద్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో ప్రతిభ కనబర్చాలన్నారు. అంతేకాకుండా క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ప్రొఫెషనల్ ప్లేయర్స్ గా ఎదిగి, ఒలింపిక్స్ కు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. వాకర్స్ అసోసియేషన్ ఫిజికల్ ఫిట్ నెస్ పై అవగాహన కల్పించాలన్నారు. తదుపరి క్రీడలలో విజేతలైన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మెమెంటోలు అందజేశారు. రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్లను, అంతర్జాతీయ స్థాయిలో టైక్వాండో మాస్టర్ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించిన శ్రీహరి, రాష్ట్ర స్థాయి స్వర్ణ పతక విజేతలను సన్మానించారు. ముగింపులో క్రీడా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి బిఎస్ ఆనంద్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీ లు, విద్యార్థులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News