రాష్ట్ర చరిత్రలో నిలిచేలా ప్రజా విజయోత్సవాలు

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సభలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

Update: 2024-11-24 09:38 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సభలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఆదివారం కలెక్టరేట్ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేద్ ఉల్లా కొత్వాల్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, ఎన్నం శ్రీనివాసరెడ్డి, మెగా రెడ్డి,జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న రైతు సభకు సంబంధించి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు.. దోపిడీలు మరిచిపోయి ఇప్పుడు ప్రజలు ధైర్యంగా ప్రభుత్వ కార్యాలయాల,సెక్రటేరియట్ కు వస్తున్నారని తెలిపారు. 

 సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు.. మునుముందు ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ, ఉద్యోగ నియామకాలు, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్తు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. రానున్న రోజులలో అభివృద్ధి పనులతో పాటు, మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి వెల్లడించారు. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీన రైతు సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ..రైతు సభ సందర్భంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న -చేపట్టబోయే కార్యక్రమాలను గురించి వివరించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని చిన్నారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడం వల్ల ఈ జిల్లాలో జరిగే కార్యక్రమాలను ఉమ్మడి జిల్లా నేతల మందిరము కలిసికట్టుగా పనిచేసే దిగ్విజయం పనిచేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.


Similar News