వాగు ఉధృతికి తెగిన తాత్కాలిక రోడ్డు.. నిలిచిన రాకపోకలు...

ఉమ్మడి ధరూర్ మండలం నీళ్లహళ్లి పాతపాలెం గ్రామాల మధ్య తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు బ్రిడ్జీ మ‌ళ్లీ తెగిపోయింది.

Update: 2024-09-01 08:16 GMT

దిశ, గద్వాల : ఉమ్మడి ధరూర్ మండలం నీళ్లహళ్లి పాతపాలెం గ్రామాల మధ్య తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు బ్రిడ్జీ మ‌ళ్లీ తెగిపోయింది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షాలకు నీళ్లహళ్లి వాగులోకి భారీగా వ‌ర‌ద ఉధృతి పెరగడంతో తాత్కాలిక మట్టి రోడ్డు బ్రిడ్జి తెగిపోయింది. నెలరోజుల వ్యవధిలో తాత్కాలిక బ్రిడ్జి మళ్లీ తెగిపోవడం విశేషం. ఏడాది క్రితం నీళ్లహళ్లి, పాతపాలెం గ్రామాల‌ మద్య ఉన్న వాగు పై బ్రిడ్జీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడంతో వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. దీంతో‌ ఉప్పేర్, నెట్టెంపాడు, నీళ్లహళ్లి, పాతపాలెం, వెంకటాపురం గ్రామాల ప్రజలు తాత్కలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు పై రాకపోకలు కొనసాగిస్తున్నారు.

గత కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు నీళ్లహళ్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాత్కాలిక రోడ్డు పూర్తిగా తెగిపోయింది. మళ్లీ తాత్కాలికంగా మట్టి రోడ్డును పునఃనిర్మించారు. కాగా రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తాత్కాలిక రోడ్డు మళ్లీ తెగిపోయింది. వర్షం వ‌స్తే చాలు వంతెన తెగిపోవ‌డం పునరావృతం కావడంతో పలు గ్రామాల ప్రజలు పాలకులు, అధికారుల పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్లు కావొస్తున్నా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం పాలకులు, అధికారుల పనితీరుకు నిదర్శనం అని మండిపడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినా ఇప్పటివరకు పూర్తి చేయకుండా ఆ సమస్యలను గాలికి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేనా..

చుట్టూ ఉన్న అయిదారు గ్రామాలకు వెళ్లాలంటే నీళ్లహళ్లి, పాతపాలెం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి మార్గమే దిక్కని అక్కడి ప్రజలు చెబుతున్నారు. కానీ, వానాకాలం వస్తే మాత్రం ఆ బ్రిడ్జి పై రాకపోకలు సాగించాలంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్టేనంటున్నారు. ఏడాది క్రితం వాగు పై బ్రిడ్జి‌నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడంతో ఆ గ్రామ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. బ్రిడ్జీ నిర్మాణం పూర్తై వాగు పై రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అందరూ అనుకున్నారు‌ కాని... రెండేండ్లు కావొస్తున్నా నీళ్లహళ్లి వాగు పై నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.

బ్రిడ్జి నిర్మాణానికి పనులు ప్రారంభించినప్పటి వరకు పూర్తి చేయకపోవడం ఆ గ్రామ ప్రజలకు శాపంగా మారింది. భారీ వర్షాలకు వాగు ఉధృత్తంగా ప్రవహించడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు నెలరోజుల వ్యవధిలోనే రెండు సార్లు కొట్టుకపోయింది. అధికారులు కంటితుడుపు చర్యగా తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని మండలంలోని నెట్టెంపాడు, నీళ్లహళ్లి, పాతాపాలెం, ఈర్లబండ తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని కోరుతున్నారు.


Similar News