MLA Anirudh Reddy :జడ్చర్ల కి అదనపు పోలీసు సిబ్బందిని ఇవ్వండి..
జడ్చర్ల పట్టణంలో పెరుగుతున్న జనాభా అవసరాలు,లావాదేవీలను దృష్టి లో ఉంచుకొని అదనపు పోలీస్ సిబ్బందిని మంజూరు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి( MLA Janampally Anirudh Reddy )కోరారు.
దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో పెరుగుతున్న జనాభా అవసరాలు,లావాదేవీలను దృష్టి లో ఉంచుకొని అదనపు పోలీస్ సిబ్బందిని మంజూరు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి( MLA Janampally Anirudh Reddy )కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం రాష్ట్ర డీజీపీ డా.జితేందర్ ను కలిసి కోరారు. జడ్చర్ల పట్టణంలో ప్రస్తుతం స్థానిక స్థానికేతరుల జనాభా 1.25 లక్షల దాకా ఉండగా.. ప్రతిరోజూ 30 వేల మంది పట్టణానికి రాక పోకలు సాగిస్తున్నారని అనిరుధ్ రెడ్డి తెలిపారు. జడ్చర్ల మండలం జనాభా లక్ష దాటిందన్నారు. జడ్చర్ల 44 వ నంబర్ జాతీయ రహదారి, 167 వ నంబర్ జాతీయ రహదారుల కూడలి గా ఉందని గుర్తు చేశారు. అలాగే రైల్వే ద్వారా పెద్ద సంఖ్యలో ఎగుమతి,దిగుమతులు కూడా జరుగుతున్న కారణంగా వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే జడ్చర్ల లో ఇప్పుడున్న ఒక్క పోలీస్ స్టేషన్ పై పని భారం పెరుగుతోందని,దీనివల్ల సమస్యలు పరిష్కరించడంలో ఇబ్బందులు పెరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే జడ్చర్ల పట్టణంలో అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడానికి, వాహనాల రాకపోకలను నియంత్రించడానికి, ప్రజలకు మరింత మెరుగైన రక్షణ కల్పించడానికి అదనపు పోలీస్ సిబ్బంది కావాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. కాగా ఈ విషయం గురించి సానుకూలంగా స్పందించిన డీజీపీ జితేందర్ ఈ విషయం గా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కు హామీ ఇచ్చారు.