మొల చింతలపల్లి ఘటనలో రెండో నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి

మొల చింతలపల్లి గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం అఘాయిత్యానికి బలైన కాట్రాజు ఈశ్వరమ్మ సంఘటనలో ప్రధాన, రెండవ నిందితుడైన బండి శివుడును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని

Update: 2024-06-23 04:31 GMT

దిశ, అచ్చంపేట: మొల చింతలపల్లి గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం అఘాయిత్యానికి బలైన కాట్రాజు ఈశ్వరమ్మ సంఘటనలో ప్రధాన, రెండవ నిందితుడైన బండి శివుడును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని.. పౌరహక్కుల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్క బాలయ్య, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు ముద్దునూరి లక్ష్మీనారాయణ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ ఎడ్ల అంబయ్య, తెలంగాణ నిర్వాసిత వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు గోరటి అనిల్, ఆదివాసీ హక్కుల పోరాట కమిటి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బల్మూరి గోపాల్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మొల చింతలపల్లి గ్రామస్తుడైన బండి శివుడును అరెస్టు చేయని ఎడల, సాక్షులను, ఫిర్యాదుదారు కుటుంబ సభ్యులను బెదిరించి కేసును నీరుగార్చి తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. కావున అమాయక ఆదివాసీ గిరిజన చెంచు బాదితులను, వారి బంధువులను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు.

సాక్షులు భయపడే అవకాశం.. పై సంఘటన విషయంలో భయాందోళనకు గురైన సాక్షులు సైతం బెదురు కుంటున్నారని, బండి శివుడు విషయంలో చట్టం తన పని తాను చేయడం లేదని, ఎవరి వత్తిడి మెరకో చట్టం పై నిందితునికి చుట్టమైందని ఆరోపించారు. కొల్లాపూర్ పోలీసు స్టేషన్ లో కొంతమంది పోలీసులు బండి శివుడును అరెస్టు కాకుండా కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం సొంత జిల్లా, జూపల్లి కృష్ణారావు ఇలాకలో ఇలా జరగడం బాధాకరం. ఇక నైనా కొల్లాపూర్ తాలూకాలోనే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణము కల్పించాలని, దళితులను, ఆదివాసీ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని, శాంతిభద్రతలను కాపాడాలని, గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కాట్రాజు ఈశ్వరమ్మ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా ఇవ్వాలనీ, బాధిత మహిళకు వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఆమె కుటుంబానికి అయిదు ఎకరాల వ్యవసాయ భూమి తో పాటు,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.


Similar News