'ఎల్​ఆర్​ఎస్​ ప్రక్రియ వంద శాతం పూర్తి కావాలి'

ఎల్​ఆర్​ఎస్​ (లేఅవుట్​ రెగ్యులరైజేషన్​ స్కీం) దరఖాస్తుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించి ఈ నెల 31 లోగా తప్పిదాలకు తావులేకుండా వంద శాతం పురోగతి సాధించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Update: 2025-03-22 15:49 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఎల్​ఆర్​ఎస్​ (లేఅవుట్​ రెగ్యులరైజేషన్​ స్కీం) దరఖాస్తుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించి ఈ నెల 31 లోగా తప్పిదాలకు తావులేకుండా వంద శాతం పురోగతి సాధించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దరఖాస్తుదారులు భవన నిర్మాణ అనుమతులు తీసుకునేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఆయన ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఎల్​ఆర్​ఎస్​ ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు సంబంధించి ప్రొసిడింగ్ జనరేట్ చేసి అందజేయాలని, ఇప్పటికీ ఫీజు చెల్లించని దరఖాస్తుదారులు రెండో దఫా ఫోన్ చేసి మార్చి 31 లోగా ఫీజులు చెల్లించేలా చూడాలని ఆదేశించారు. ఎల్​ఆర్ఎస్​ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ లు సంబంధిత మున్సిపల్ కమిషనర్ లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఎల్​ఆర్​ఎస్​ వల్ల కలిగే ప్రయోజనాలను దరఖాస్తుదారులకు తెలిసేలా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లకు ఆయన సూచించారు. ఈ నెల 24 వ తేదీన ఎల్​ఆర్ఎస్​ ల పురోగతి పై జిల్లా కలెక్టర్లు, కమిషనర్లతో మరోసారి సమీక్ష నిర్వహిస్తానని ఆయన తెలిపారు. ఈ విడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తదితర కమిషనర్లు పాల్గొన్నారు.

పరిశ్రమల స్థాపనకు గడువులోగా అనుమతివ్వాలి...

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, టీజీ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి మంజూరు చేయవలసిన అనుమతులను నిబంధనల మేరకు నిర్ధేశిత గడువులోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె హాజరై మాట్లాడారు. టీ ఫ్రైడ్ ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి ఒకరికి ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ కింద కారు, షెడ్యూల్డ్ తెగల ఇద్దరికీ కార్లు, ట్రాక్టర్ అండ్ ట్రైలర్స్ వాహనాలకు పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీలో కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి, ఎల్డీయం భాస్కర్, భూగర్భ జల వనరుల శాఖ డిడి రమాదేవి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రావణ్ కుమార్, తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Similar News