గ్రామాల్లో గుప్పుమంటున్న మత్తు.. బానిసగా మారుతున్న యువత..

నియోజకవర్గంలో యువతతో పాటుగా మైనర్లు గంజాయి, సారా, వైట్నర్ పీలుస్తూ మత్తుతో జీవితం ప్రశ్నార్ధకం చేసుకుంటున్నారు.

Update: 2025-03-25 04:36 GMT
గ్రామాల్లో గుప్పుమంటున్న మత్తు.. బానిసగా మారుతున్న యువత..
  • whatsapp icon

దిశ,డోర్నకల్: నియోజకవర్గంలో యువతతో పాటుగా మైనర్లు గంజాయి, సారా, వైట్నర్ పీలుస్తూ మత్తుతో జీవితం ప్రశ్నార్ధకం చేసుకుంటున్నారు. మరో పక్క క్రికెట్ బెట్టింగ్, ఆన్​లైన్ రమ్మీతో లక్షల్లో అప్పులు చేస్తూ.. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ప్రధానంగా మైనర్లు సైతం సెల్ ఫోన్ దుర్వినియోగం చేస్తూ మత్తు కోసం కొత్తకొత్త విధానాలుకనిపెడుతున్నారు. తల్లిదండ్రులకు అనుమానం రాకుండా రాత్రివేళ కంబైన్డ్ స్టడీ పేరుతో మత్తులో జోగుతున్నట్లు సమాచారం. యువత సైతం మత్తు కోసం గంజాయి సేవిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయి, సారా దందా నిర్వహించే వారు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని డోర్ డెలివరీ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గంజాయి దొరకని వారు మత్తుకోసం వైట్ నర్, బోనోఫిక్స్ వాడుస్తున్నారు. పక్క జిల్లాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అనేక మార్గాల్లో తరలిస్తున్నట్లు సమాచారం.

గంజాయి వైపు యువత..

సిగరెట్ తాగడంతో మొదలైన ఈ అలవాటు తోటి మిత్రులతో కలిసి గంజాయి తాగడం ఒక ఫ్యాషన్ గా మారుతుంది. సిగరెట్లకు బదులు ఓసీబీ పేపర్లు వాడుతూ గంజాయి పీలుస్తున్నారు. నిషాలో జోగుతూ భవిష్యత్​ను చిత్తు చేసుకుంటున్నారు. మత్తులో డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. గతంలో పట్టణాల్లో ఒకలిద్దరూ గంజాయి సేవించే వారు ఉండేవారు కానీ, ప్రస్తుతం ఊరూరా మత్తుబాబులు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

వీకెండ్లలో జోరు..

సాధారణ రోజుల్లో కన్నా వారాంతపు రోజులు శని, ఆదివారాల్లో మత్తుబాబులు పండుగ చేసుకుంటున్నారు. ప్రతి రోజు సాయంత్రం నిర్మాణుష్య ప్రాంతాల్లో యువత గంజాయి సేవిసున్నట్లు సమాచారం. తక్కువ ఖర్చులో ఎక్కువ కిక్కు కోసం సారా కూడా సేవిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్​లో పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువగా గంజాయి, మద్యం సేవించినవారే అధికంగా ఉంటున్నట్లు పోలీసు శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

తల్లిదండ్రుల అప్రమత్తత ప్రధానం..

పిల్లల అలవాట్లు, పాఠశాల, కాలేజీ విద్యాభ్యాసం, రోజు వారి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తేడా కనిపిస్తే వెంటనే మందలించారు. లేదంటే పిల్లలు దారితప్పే ప్రమాదం ఉంది. గంజాయి సేవించే వారిని గుర్తించి బైండవర్లు చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఊరూరా మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన నిర్వహిస్తున్నాం.

                                                                                                                                  - డోర్నకల్ సర్కిల్ ఇన్​స్పెక్టర్ రాజేష్

మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా..

మత్తు పదార్థాలు సేవించే వారిని గుర్తించి కౌన్సెలింగ్, సోషల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎనిమిది నెలల్లో మూడు కేసులు నమోదు కాగా, దాదాపు 204 కేజీల గంజాయి పట్టుబడింది. పాత కేసులు పరిశీలించి మళ్లీ బైండవర్ చేయడం జరిగింది. యువత ఎక్కువగా గంజాయి సేవించడానికి మొగ్గు చూపుతున్నారు. మత్తుపదార్థాల రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టాం.

                                                                                                                                      - మరిపెడ సర్కిల్ ఇన్​స్పెక్టర్ రాజ్ కుమార్

Similar News