SLBC టన్నెల్ దుర్ఘటనకు నెల రోజులు

దేశంలోనే 25 ప్రఖ్యాతిగాంచిన ఏజెన్సీలు, 700 మందికి పైగా సిబ్బంది, నిరంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణ, అయినా ఎస్ఎల్బీసీలో చిక్కుకుపోయి నెల రోజులు దాటుతున్నా ఇప్పటివరకు ఆ ఏడుగురి ఆచూకీ లభించలేదు.

Update: 2025-03-25 01:45 GMT
SLBC టన్నెల్ దుర్ఘటనకు నెల రోజులు
  • whatsapp icon

దిశ, అచ్చంపేట: దేశంలోనే 25 ప్రఖ్యాతిగాంచిన ఏజెన్సీలు, 700 మందికి పైగా సిబ్బంది, నిరంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణ, అయినా ఎస్ఎల్బీసీలో చిక్కుకుపోయి నెల రోజులు దాటుతున్నా ఇప్పటివరకు ఆ ఏడుగురి ఆచూకీ లభించలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేటి నుంచి పనులలో మరింత వేగం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అడుగడుగునా ఆటంకాలే..

సొరంగంలో 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరగడం, అక్కడ గాలి వెలుతురు తక్కువగా ఉండడం, నీరు పెద్ద ఎత్తున ఊరడం తదితర కారణాలతో సొరంగంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించడానికి పెద్ద ఎత్తున ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇరువైపులా ఉన్న 30 మీటర్ల ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా ఉండడం, సహాయ చర్యలు చేపట్టే క్రమంలో, ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉండటంతో, సహాయ కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు అధికారులు గుర్తించి, ప్రభుత్వానికి నివేదికను పంపారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న టీబీఎం విడిభాగాలు, మట్టి, రాళ్లను తొలగించడానికి పేరుకొని ఉన్న మట్టి.. ఉబికి వస్తున్న నీళ్లు పెద్ద ఆటంకాలుగా మారుతున్నాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనడం కష్టతరం అవుతోంది.

కలెక్టర్.. ఎస్పీ ఇద్దరూ అక్కడే..

ప్రమాదం జరిగిన రోజు నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇద్దరు అక్కడే ఉండడం.. ప్రతి రోజు కార్యక్రమాలను పర్యవేక్షించడం.. తగిన సలహాలు.. సూచనలు చేస్తూ.. ప్రతిరోజు నివేదికను ప్రభుత్వానికి పంపించాల్సి వస్తోంది.. ఇద్దరు జిల్లాకు ముఖ్యమైన అధికారులు ఆ పనులలో ఉండడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, ఇతర పనులు, నత్త నడకన సాగుతుండటంతో.. ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ తమ విధులను సక్రమంగా నిర్వహించుకునేలా, ఎస్ఎల్బీసీ పనుల పర్యవేక్షణకు మరో ఐఏఎస్ ను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం నుంచి ఆ ఐఏఎస్ అధికారి విధులలో చేరనున్నారు.

ఆ ఏడుగురు ఆచూకీ కనుగొనడమే లక్ష్యం..

ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చిక్కుకోగా అధికారులు ఒకరి మృతదేహాన్ని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగా.. మిగిలిన ఏడుగురి కోసం నిరంతర ప్రయత్నాలు సాగిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో అని ఒకసారి.. వారం రోజుల్లో ప్రమాదం బారిన పడ్డవారి ఆచూకీ లభించవచ్చని అధికారులు చెబుతూ వచ్చారు. కానీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. సీఎం రేవంత్ రెడ్డి విషయాన్ని సీరియస్ గా తీసుకుని.. ఏదో విధంగా.. ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే గుర్తించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కోరేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం పై మంగళవారం నుంచి పనులలో వేగం పెరగనుండడంతో ప్రమాదంలో చిక్కుకుపోయిన వారి ఆచూకీ సాధ్యమైనంత త్వరలోనే, లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు రెస్క్యూ టీంలు సభ్యులు భావిస్తున్నారు.


Similar News