సీఎం కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ జల ప్రగతి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

సీఎం కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి, ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, రీ డిజైన్ తో తెలంగాణ సాగునీటి రంగంలో నవ శకం ప్రారంభమైందని తెలంగాణ నలుదిశల జల ప్రగతి ప్రవాహం కొనసాగుతున్నదని మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.

Update: 2023-06-07 15:13 GMT

దిశ, జడ్చర్ల: సీఎం కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి, ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, రీ డిజైన్ తో తెలంగాణ సాగునీటి రంగంలో నవ శకం ప్రారంభమైందని తెలంగాణ నలుదిశల జల ప్రగతి ప్రవాహం కొనసాగుతున్నదని మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సాగునీటి దినోత్సవంలో భాగంగా 9 ఏండ్ల కాలంలో తాగునీటి రంగంలో సాధించిన ప్రగతిపై నియోజకవర్గం వారీగా రూపొందించిన నివేదికను వెల్లడించడంతోపాటు మిషన్ కాకతీయ పథకం సాధించిన ఫలితాలపై రూపొందించిన డాక్యుమెంటరీ ని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వాలకు 70 ఏళ్లలో ప్రతిపక్షాలు ఏనాడు కూడా అడ్డుపడలేదని కానీ నేడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ జిల్లాకే చెందిన నాయకులు కేసులు వేస్తూ అడ్డుపడుతూ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యానికి కారకులై రైతులను నష్టపరుస్తున్నారని విమర్శించారు.  అయినా అడ్డంకులను తొలగించుకొని ప్రాజెక్ట్ నిర్మాణ పనులను శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. నాడు కరువుకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఏకంగా నాలుగు ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో 8 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందుతున్నదని. సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారని ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుందని అన్నారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి కృష్ణాజిల్లాలను మిడ్జిల్, ఉరుకొండ మండలాల్లోని గ్రామాల వరకు పారించామన్నారు.

నేడు మండువేసవిలో సైతం చెరువులు కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయన్నారు. దుందుభి వాగు పై చెక్ డ్యాంలు నిర్మించడంతో దుందుభి పొడవునా మండు వేసవిలోనూ జలకళ సంతరించుకుందన్నారు. త్వరలోనే ఉదండపూర్ రిజర్వాయర్ పూర్తి చేసి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించి జడ్చర్ల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కూడగల్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, పిఎసిఎస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్, ముడా డైరెక్టర్లు ఇంతియాజ్ ఖాన్, శ్రీశైలం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News