ACB raids : ఏసీబీ దాడుల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సర్వేయర్

వ్యవసాయ భూమి సరిహద్దులను కొలవడానికి లంచం తీసుకుంటున్న సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Update: 2024-07-25 14:16 GMT

దిశ, మక్తల్: వ్యవసాయ భూమి సరిహద్దులను కొలవడానికి లంచం తీసుకుంటున్న సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సరిహద్దులు నిర్ణయించడానికి రూ.12 వేలు ఇస్తేనే చేస్తానని లంచం డిమాండ్ చేయడంతో రైతు ఆ సర్వేయర్‌ను అవినీతి నిరోధక అధికారులకు పట్టించాడు. గురువారం మక్తల్ పట్టణంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మక్తల్ పట్టణానికి చెందిన గాసం వెంకటేష్‌కు మంతన్‌గోడు గ్రామంలో సర్వే నెం. 107, 121లో 17 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని నలుగురు అన్నదమ్ములు నాలుగు భాగాలుగా విభజించుకుని పంచుకున్నారు. అయితే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సరిహద్దులు నిర్ణయించాలని కోరుతూ ఏప్రిల్ 22న ఫీజులు చెల్లించి మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సర్వేయర్ బాలరాజు జూన్ 26న పొలం దగ్గరకు వెళ్లి పరిశీలించాడు.

హద్దులు నిర్ణయించేందుకు మ్యాప్ తీసుకువస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆయన ఆ తర్వాత ఎంతకూ రాకపోవడంతో ఈనెల 6న తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వెంకటేశ్ సర్వేయర్‌ని కలిశాడు. భూమికి హద్దులు నిర్ణయించడానికి రావాలని కోరగా.. రూ.12,000 ఇస్తేనే వస్తానని, లేకపోతే రానని భీష్మించుకు కూర్చున్నాడు. తన దగ్గర మూడు వేలే ఉన్నాయని ఆ నగదు సర్వేయర్ బాలరాజుకు ఇచ్చివెళ్లాడు. అయినా భూమిని కొలవడానికి సర్వేయర్ రాకపోవడంతో వాకాబు చేసిన రైతుకు షాక్ ఇచ్చాడు. మిగతా రూ.9వేలు ఇస్తేనే వస్తానని తేల్చి చెప్పాడు.

చేసేదేం లేక రైతు వెంకటేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సర్వేయర్ నాగరాజు లంచ దాహాన్ని వివరించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం మక్తల్ తహసీల్దార్ కార్యాలయంపై దాడులు చేశారు. రైతు వెంకటేశ్ నుంచి రూ.9వేలు లంచం తీసుకుంటున్న సర్వేయర్ నాగరాజును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఏసీడీ డీఎస్పీ శ్రావణ కృష్ణ గౌడ్, ఇన్‌స్పెక్టర్లు సయ్యద్ అబ్దుల్ ఖాదర్, జిలాని, లింగయ్య, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, మక్తల్‌లో ఏసీబీ దాడులు చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం.


Similar News