‘స్థానికం’పై ఫోకస్.. గ్రామాల్లో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.

Update: 2024-10-18 03:32 GMT

దిశ, మహబూబ్‌ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం ముఖ్యంగా డిసెంబర్ చివరి వరకు మున్సిపాలిటీల పదవీ కాలం కూడా ముగియనున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీ మినహాయించి మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు జరగవలసి ఉన్నప్పటికిని కులగణన చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఎన్నికలు కొంత ఆలస్యం అయ్యాయి. కులగణన ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల్లో పార్టీ సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు స్థానాలు మినహాయించి మిగిలిన అన్ని స్థానాలలో గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికిని.. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలో స్థానాలు లేకపోవడంతో.. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా పూర్తిస్థాయిలో పట్టు సాధించాలన్న అధిష్టానం ఆదేశాలతో నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తున్నారు.

ముఖ్య నేతలకు హింట్..

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పలువురు నాయకులు సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ పదవులను ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు యధావిధిగా ఉంటాయా..!? లేక మారుతాయా అన్న అంశాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. టిక్కెట్ ఆశిస్తున్న వారి వివరాలు ఇప్పటికే ఎమ్మెల్యేలు తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. పనిచేస్తూ వెళ్లండి. అవకాశాలు అవే వస్తాయి అని హింట్ ఇవ్వడంతో ఆయా గ్రామాలు మండలాలు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ప్రతి కార్యక్రమం సద్వినియోగం..

ప్రభుత్వ, ప్రైవేటు అన్న తేడాలు లేకుండా ప్రతి కార్యక్రమాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు వినియోగించుకుంటున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ, మత్స్యకారులకు ప్రయోజనకరంగా చెరువులలో చేప పిల్లలను వదిలే కార్యక్రమాలు, విద్యా, క్రీడా సంబంధిత కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహాయించి మిగతా వారు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా.. స్థానిక సంస్థలలోనూ కాంగ్రెస్ పార్టీ వారినే గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుందనే భావన ప్రజలకు వచ్చేలా ఎమ్మెల్యేలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అధికార కార్యక్రమాలే కాకుండా, చిన్న చిన్న ప్రైవేటు కార్యక్రమాలకు సైతం హాజరవుతున్నారు.


Similar News