ఇసుక దందాలపై నిఘా..ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్

ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక దందా ల

Update: 2024-12-24 02:26 GMT

దిశ, మక్తల్/రాజాపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక దందా ల పై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. మక్తల్, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర, అలంపూర్, కల్వకుర్తి, అచ్చంపేట తదితర నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇసుక దందా పై మీడియాలో వరుస కథనాలు వస్తుండటం, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి దిశ ప్రత్యేక కథనాలను ఇవ్వడంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

పూర్తిస్థాయిలో వివరాల సేకరణ..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక డంపు చేస్తున్న వారి వివరాలను ఇంటెలిజెన్స్ ఇప్పటికే సేకరించినట్లు సమాచారం. ఈ దందా దర్జాగా సాగడానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాత్రలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు అన్నింటినీ జిల్లా ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదికను పంపనున్నారు. కాగా, ఇసుక దందా చేస్తున్నవారు ఎప్పటినుంచి చేస్తున్నారు.? ఎక్కడికి సరఫరా చేస్తున్నారు..!? సరఫరా చేయడానికి ఉపయోగిస్తున్న వాహనాలు ఏంటి..!? ఆ వాహనాలను ఎలా కొనుగోలు చేశారు ..!? అన్న వివరాలపై ఇంటెలిజెన్స్, తదితర యంత్రాంగాలు రహస్యంగా సమాచారాలు తీసుకుంటున్నారు. పలు నియోజకవర్గాల్లో అధికారులు.. ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఇసుక, మట్టి వ్యాపారాలు సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మక్తల్, కోయిలకొండ, కల్వకుర్తి, తదితర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా చేసే వ్యాపారులే కాదు.. కొంతమంది అధికారులు.. ప్రజా ప్రతినిధులు సైతం కోట్లకు పడగలెత్తినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.

త్వరలోనే ఇసుక సరఫరాపై నిర్ణయాలు..

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వానికి లాభం చేకూరి విధంగా ఇసుక పాలసీని రూపొందించే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ జిల్లాల పరిస్థితులు, ఇసుక లభ్యత, అవసరాలను బట్టి నిర్ణయాలు ఉండవచ్చు అని సమాచారం.

ఇసుక తయారీ స్థావరాలపై దాడులు

రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామ శివారులో గల దుందుభి వాగు లో సోమవారం అక్రమ ఇసుక తయారీకి సంబంధించిన యంత్రాల ధ్వంసం చేశారు. 35ట్రాక్టర్ల అక్రమ ఇసుక సీజ్ చేశారు. స్థానిక రెవెన్యూ, పోలీసులు, మైనింగ్,టాస్క్ ఫోర్స్ అధికారుల పర్యవేక్షణలో దాడులు జరిపి కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.


Similar News