పనిచేసే ప్రభుత్వానికి మద్దతునివ్వండి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
గతంతో పోలిస్తే జడ్చర్ల పట్టణ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
రూ.18.44కోట్లతో మున్సిపల్ బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం
దిశ, జడ్చర్ల: గతంతో పోలిస్తే జడ్చర్ల పట్టణ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి మహబూబ్ నగర్ కలెక్టర్ రవినాయక్ తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో జడ్చర్లలో చాలా మార్పులు జరిగాయని అన్నారు. విశాలమైన రోడ్లు, కాలనీలకు సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థ కూడా మెరుగైందన్నారు.
ప్రజల జీవన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడిందన్నారు. తాగునీటికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రజలు కూడా అభివృద్ధిని గమనించాలని, పని చేసే ప్రభుత్వానికే పూర్తి సహకారం అందించాలని కోరారు. పార్టీలకు అతీతంగా, ఏ వార్డులని తేడా లేకుండా నిధుల కేటాయింపు చేస్తామన్నామని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తామ ఎమ్మెల్యే వెల్లడించారు. అంతకు ముందు కలెక్టర్ రవినాయక్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కౌన్సిల్ సభ్యులు, అధికారులు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. అనంతరం జడ్చర్ల మున్సిపాలిటీ కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించి రూ.18.44 కోట్లతో రూపొందించిన మున్సిపల్ బడ్జెట్ అంచనాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి రవీందర్, వైస్ చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్యం గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.