‘కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి’
భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను
దిశ, అచ్చంపేట : భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ నిండు సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించడం ముమ్మాటికి ఈ దేశంలో ఉన్న 150 కోట్ల మంది ప్రాథమిక హక్కుల పై దాడి జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీ, టీపీసీసీ ఆదేశాలతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం అచ్చంపేట పట్టణంలో మహా నిరసన ర్యాలీ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ మల్లు రవి ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వద్దకు అంబేద్కర్ చిత్రపటాలను చేబూని ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణులు మాట్లాడుతూ... అమిత్ షాను భర్త రఫ్ చేసేంతవరకు నిరసన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన విధానం అమలులో ఉందంటే అది మనందరికీ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా పెట్టిన బిక్షనేనని ప్రధానంగా ఈ దేశంలో ఉన్న మహిళలకు ఓటు హక్కుతో పాటు అన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే రాజ్యాంగమే కారణమని, బీజేపీ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగానే రాజ్యాంగం పై దాడి చేస్తుందని విమర్శించారు. హోంమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్ లోపల బయట ఆందోళన కార్యక్రమాలు ఎంపీలందరూ చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాలకులు పాటుపడాల్సింది పోయి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో మనుస్మృతిని నిచ్చెనమెట్ల వ్యవస్థను తీసుకువచ్చి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి తో పాటు భారత రాజ్యాంగాన్ని అవును పరచడమే లక్ష్యంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాయకులు నీచ ప్రజాస్వామ్య విధానానికి శ్రీకారం చుడుతున్నారని విమర్శించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఎక్కడ బిజెపి క్యాడర్ను ఆదరించకుండా.. రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ప్రజలే తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ లాయర్ రాజేందర్, కట్ట గోపాల్ రెడ్డి, అంబేద్కర్ వాదులు శ్రీశైలం, ఆనంద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంద మల్లికార్జున్, ఎన్ఎస్ యు ఐ నాయకులు, ప్రజాప్ర తిథులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.