‘ఆ ఎస్పీ ఉన్నంతకాలం నేను నారాయణపేట జిల్లాలో దొంగతనం చేయను’
దొంగతనాలకు పాల్పడడం ఆ తర్వాత పట్టు పడడం
దిశ, నారాయణపేట క్రైం: దొంగతనాలకు పాల్పడడం ఆ తర్వాత పట్టు పడడం జైలుకెళ్లడం జైలు నుంచి బయటకు రావడం మనం చూస్తూనే ఉంటాం. కానీ సుమారు 94 దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న అప్పలనాయుడు నారాయణపేట ఎస్పీని కలిసేందుకు సోమవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ కు చెందిన అప్పలనాయుడు ఇంట్లో అందరూ ఉండగానే చోరీ చేసి ఎవరికి చిక్కకుండా జల్సాలు చేయడం ఈయన ప్రత్యేకత. సినిమా డైరెక్టర్ కావాలన్నా ఆయన లక్ష్యం కోసం డబ్బులు అవసరం కాబట్టి దొంగతనాలు చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది.
నారాయణపేట జిల్లాలో గతంలో జరిగిన 6 దొంగతనాలకు సంబంధించి నిందితుడిగా ఉన్న అప్పలనాయుడును పోలీసులు గుర్తించి బంగారు... నగదు రికవరీ చేసి దొంగతనాల కేసు వివరాలను ఎస్పీ యోగేష్ గౌతమ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో గతంలో వెల్లడించారు. మక్తల్, మరికల్ నారాయణపేట పరిధిలో తాజాగా చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. గతంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో కూడా దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ వెల్లడించి నారాయణపేట జిల్లాలో జరిగిన 6 కేసులకు సంబంధించి 75 తులాల బంగారం 35 తులాల వెండి రూ .4 లక్షల నగదును రికవరీ చేశారు.
ఇలాంటి ఎస్పీని నేనెప్పుడూ చూడలేను...
తాను పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ... గతంలో తాను పలు దొంగతనాల కేసుల్లో పట్టుపడితే ఉన్నవి లేనివి కేసులు నమోదు చేయడం అనవసరపు రికవరీలు చేయడం కొన్ని జిల్లాల పోలీసుల్లో చూశానని... కానీ నారాయణపేట ఎస్పీ మాత్రం ఉన్న కేసులు మాత్రమే పెట్టండి లేని వాటిని పెట్టకండి ఎంత దొంగతనం చేస్తే అంతే రికవరీ చేయండి అని చెప్పడం తనలో ఎంతో మార్పు తీసుకు వచ్చిందన్నారు. నారాయణపేట యోగేష్ గౌతమ్ ఉన్నంతవరకు నారాయణపేట జిల్లా పరిధిలో దొంగతనాలు చేయబోనని సోమవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చిన పలువురితో చెప్పాడు. సోమవారం కోర్టుకు వచ్చిన అప్పలనాయుడు ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసేందుకు రాగ అప్పలనాయుడుతో దిశ ప్రతినిధి మాట్లాడుతూ దొంగతనానికి దారి తీసిన పరిస్థితులను ఇతర విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.