పిల్లల్లో పోటీ భావం పెంపొందించేందుకే క్రీడలు అనివార్యం
పిల్లల్లో పోటీ భావాన్ని పెంపొందించేందుకు క్రీడలు కీలకమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.
దిశ, జడ్చర్ల :పిల్లల్లో పోటీ భావాన్ని పెంపొందించేందుకు క్రీడలు కీలకమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. గెలుపు-ఓటమిలను అధిగమిస్తూ.. క్రీడల్లో నిరంతరం పాల్గొనాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం జడ్చర్ల మండల పరిధిలోని చిట్టిబోయినపల్లిలోని తెలంగాణ ఎస్సీ గురుకులం నిర్వహించిన.. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) 10వ జోనల్ క్రీడోత్సవ ప్రారంభోత్సవంలో ఎంపీ అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..గెలుపు ఓటమి ఏ ఆటలోనైనా భాగమేనని, విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవరచుకొని, ప్రతి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి పోటీల్లో గెలుపు సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. విద్యార్థి దశ ఎన్నటికీ మర్చిపోలేనిదని స్కూల్ లైఫ్ లో జరిగిన విషయాలను తీపి జ్ఞాపకాలని, గురుకులాల్లో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చాలని సూచించారు. విద్యార్థుల ఆసక్తులతో ఉపాధ్యాయులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని ఎనిమిది సోషల్ వెల్ఫేర్ గురుకులాల నుంచి 680 మంది బాలికలు క్రీడోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 14న ముగియనుంది. ఎంపీ జెండా ఆవిష్కరణ చేసి..దీపప్రజ్వలన చేశారు. విద్యార్థుల మార్చ్ పాస్ట్‌ను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ ఈ బాలికల్లో అపారమైన ప్రతిభ ఉందని ఎంపీ అభినందించారు. "వారి ప్రతిభను సరైన దిశలో నడిపిస్తే, ఆసక్తి కలిగిన ప్రతి ఆటలో శిక్షణ అందిస్తే, వారు విశేషమైన విజయాలను సాధించగలరు అని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో వాలీబాల్, ఫుట్‌బాల్, టెన్నిస్, అథ్లెటిక్స్, క్రికెట్ వంటి క్రీడలకు శిక్షణ కోసం కోచ్‌లను నియమించాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి, విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని అభ్యర్థించారు. ఈ క్రీడోత్సవాన్ని ప్రారంభించేందుకు ఎంపీ వాలీబాల్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో TSWREIS డిప్యూటీ సెక్రటరీ డి. రాజేశ్వరి, చిట్టిబోయినపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్. అనిత, జిల్లా సమన్వయకర్త యు. వాణిశ్రీలు పాల్గొన్నారు.