సంక్రాంతి మీనింగ్ తెలుసా...?
సంక్రాంతి సంబురాలకు పల్లెలు ముస్తాబయ్యాయి. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల...Special Story on Sanktranti
దిశ, రాజోలి: సంక్రాంతి సంబురాలకు పల్లెలు ముస్తాబయ్యాయి. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో మూడు రోజులపాటు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మండల ప్రజలు సిద్ధమయ్యారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పండుగ సంబురాలు నిర్వహించుకోవడానికి పట్నం వాసులు ఇప్పటికే పల్లెలకు చేరుకోవడంతో గ్రామసీమలు సందడిగా మారాయి. నేడు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమను జరుపుకోనుండగా, ఇంటింటా పిండి వంటలు ఘుమఘుమలాడుతున్నాయి. ఇక నోములు, వ్రతాలు ఆచరించేవారు పూజా సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. పతంగులు ఎగురవేతలో చిన్నారులు బిజీగా మారారు. పతంగుల దుకాణాల వద్ద సందడి నెలకొంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో తెలుగు లోగిళ్లు సందడిగా మారాయి. మూడు రోజుల వేడుకలతో గ్రామీణ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ఇంటింటా పిండి వంటలు, వాకిళ్లలో ముత్యాల ముగ్గులు, కొత్త అల్లుళ్ల రాకతో పల్లెలన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి. ఇంటి ముంగిట గొబ్బెమ్మలు, గాలిపటాలు.. ఇలా వివిధ రకాల కార్యక్రమాలతో సందడిగా మారాయి. ఆడపడుచులు ఇండ్ల వాకిళ్లలో ముత్యాల ముగ్గులు వేసి తీరొక్క రంగులతో నింపి చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. కాగా, మొదటి రోజు భోగి, రెండోరోజు మకర సంక్రాంతి, మూడోరోజు కనుమ పండుగను జరుపుకోవడానికి మండల ప్రజలు సిద్ధమయ్యారు.
సంక్రాంతి సంబరాలు
పండుగలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండుగలో భోగికి ప్రత్యేకత ఉంది. పాత వస్తువులను మంటల్లో వేసి చెడును పారదోలి మంచిని ఆస్వాదించడం భోగి విశిష్టత. ఆడపడుచులు కొత్త బట్టలు వేసుకొని ఇంటి ఎదుట వాకిళ్లలో రంగురంగుల రంగవల్లులు వేస్తారు. ఉదయాన్నే పాలు పొంగించి, ఇంటి ముంగిట గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు పోస్తారు. సంక్రాంతి అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది, ద్వాదశ రాశులందూ క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడంతో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. హేమంత రుతువులో చల్లటి గాలులు, మంచుకురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చేది మకర సంక్రాంతి. ఈ సమయంలో మకర సంక్రాంతికి ప్రాధాన్యం సంతరించుకుంది. సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడతాడు. అందుకే స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలు చాలా గొప్పవని చెబుతారు. ముఖ్యంగా ధాన్యం, ఫలాలు, కాయగూరలు తదితర వాటిని దానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.
ఇంటింటా పిండి వంటలు..
పండుగకు వారం రోజుల ముందు నుంచి పిండి వంటలు తయారు చేస్తారు. ఈ పండుగకు సకినాలు స్పెషల్. బియ్యం, పిండి, ఓమ, ఉప్పుతో కలిపి సకినాలు తయారు చేస్తారు. గారెలు, పూసబిల్లలు, అరిసెలు ఇలా పిండితో అనేక వంటకాలను ఇంటింటా చేస్తారు. మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా వంటలు చేసుకొని తింటారు. కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల కలయికతో సరదాగా గడుపుతారు.
ఇంటి ముంగిట గొబ్బెమ్మలు
ఇంటి ముంగిట్లో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పెడతారు. గొబ్బెమ్మలతోపాటు అందులో నవధాన్యాలు పోస్తారు. గొబ్బెమ్మకు గరక పోస, గడ్డి పువ్వు, పసుపు, కుంకుమలు పెట్టి అందంగా తయారు చేస్తారు. పండుగ మూడు రోజులు ఇంటి ముంగిట వాకిళ్లలో, పశువు పాక వద్ద ప్రత్యేకంగా పెడతారు.
పిల్లల గాలిపటాలు..
సంక్రాంతి వచ్చిందంటే పిల్లలకు మహా సరదా. దసరా తర్వాత పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పండుగ సంక్రాంతి. ఎక్కువ శాతం పిల్లలంతా తమ అమ్మమ్మ వాళ్ల ఇండ్లలోకి వెళ్లి సరదాగా గడుపుతారు. పట్టణాల్లో ఉన్న వారంతా పల్లెలకు చేరుకుంటారు. నిత్యం పుస్తకాలు, ఆన్‌లైన్ క్లాసులతో కుస్తీ పట్టి అలసిసొలసిన పసి హృదయాలు గాలి పటాలను ఎగురవేసి ఆనందిస్తారు. రంగు రంగుల గాలి పటాలను పోటాపోటీగా ఎగురవేస్తూ కేరింతలు కొడతారు.
సంక్రాంతి నోములు, వ్రతాలు..
పండుగ సందర్భంగా ముత్తైదువులు నోములు, వ్రతాలు ఆచరిస్తుంటారు. చక్కెరను కరగబోసి వివిధ ఆకృతుల్లో రూపొందించే నోముల్లో రేగుపండ్లు, జీడిపండ్లు, పసుపు, కుంకుమలతో నువ్వులు, పసుపుతో సిద్ధం చేసిన గౌరీ దేవతామూర్తిని కొలుస్తారు. వీటి ఎదుట వివిధ రకాల లోహాలు, ప్లాస్టిక్ తదితర సామాగ్రితో తయారు చేసిన 13 సంఖ్య గల ఆహార సామాగ్రిని ఒక నోముగా పరిగణిస్తారు. వీటిని మహిళలు పూజించి ఇతర మహిళలకు అందిస్తారు. సంక్రాంతి రోజు నువ్వులు, బెల్లంతో తయారు చేసిన ముద్దలను దానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతున్నది.
కాటిరావలు..
రైతులు కాటిరావల పండుగను ప్రత్యేకంగా చేస్తారు. తమ పశువుల పాక వద్ద ఈ పండుగను నిర్వహిస్తారు. పశువులను శుభ్రంగా కడిగి, కొమ్ములకు జాజు పూసి అందంగా అలంకరిస్తారు. పరమానాన్ని తయారు చేసి సాయంత్రం వేళలో రైతులంతా తమ దొడ్ల వద్ద జమ అవుతారు. వండిన వేడివేడి పరమానాన్ని పశువుల చుట్టూ తిరుగుతూ వేస్తారు. ఇష్ట దైవానికి నైవేద్యం సమర్పించిన అనంతరం కోళ్లు, మేకలను కోసుకుని కాటిరావల పండుగను జరుపుకుంటారు. గొడ్డు, గోదా చల్లంగా ఉండాలని మొక్కుకుంటారు. ఇలా మూడు రోజులపాటు సంక్రాంతి సంబురాలను జరుపుకొంటారు.
మార్కెట్లు కళకళ
రాజోలి మండల కేంద్రంలోని దుకాణాలు, బట్టల షాపులు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. జీడి, రేగు పండ్లు, పిడుకలు, ఆవు పేడ, గొబ్బెమ్మలు, వివిధ రకాల రంగులు, మట్టి పాత్రలు, గరిక, బంతిపూల కొనుగోళ్లతో సందడిగా మారాయి. వివిధ రకాల గాలిపటాలు, చక్రీలు, దారాలు భారీగా విక్రయిస్తున్నారు. మహిళల వ్రతాలు, నోముల సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి సిద్ధమవుతున్నారు.
కళ తగ్గిన సంక్రాంతి
గతంలో ఇప్పటికీ పండుగలు చేసుకోవడంలో అనేక విధాలుగా మార్పులొచ్చాయి. గతంలో సంక్రాంతికి వారం ముందే ఇళ్ల ఎదుట హరిదాసులు, గంగిరెద్దులు వచ్చి సందడి చేసేవి. వర్షాకాలంలో పండిన పంటలు చేతికొచ్చి ఇంటికి చేరేవి. హరిదాసులకు, గంగిరెద్దుల వారికి కొంత దానం చేయడం ఆనవాయితీ. గంగిరెద్దులు కూడా కనుమరుగయ్యాయి. హరిదాసులు కానరారు. కరువు కాటలతో మారుతున్న జీవన సంస్కృతి దీనికి నిదర్శనమని చెప్పాలి. మనుషుల్లో వచ్చిన మార్పులు సంక్రాంతి పండుగను కనుమరుగు చేసినవని చెప్పాలి.