నల్లమల్లలో మరోసారి యురేనియం కలకలం? (వీడియో)

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం బీకే తిరుమలాపూర్ గ్రామంలో...Special Story of Nallamala Forest

Update: 2023-01-07 12:01 GMT

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం బీకే తిరుమలాపూర్ గ్రామంలో శనివారం ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల ఆవరణలో బోరు బండి ద్వారా డ్రిల్లింగ్ చేస్తూ మట్టిని సేకరిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు యురేనియం కోసమే మరోసారి భూగర్భంలో మట్టి సేకరణ చేపడుతున్నారని ఆందోళనకు గురై బోరు డ్రిల్లింగ్ చేసేది లేదని గ్రామస్తులతోపాటు యురేనియం జేఏసీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు బోరు డ్రైవింగ్ పనులను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో నల్లమలలో మరోసారి యురేనియం ఆనవాళ్ల కోసం భూగర్భంలో ఉన్న మట్టిని సేకరిస్తున్నారన్న విషయం ఆందోళన చెందుతూ శనివారం కలకలం రేపింది. తద్వారా నల్లమల ప్రజలు మళ్ళీ ఏం జరుగుతున్నదని భయందోళనలో ఉన్నారు.


ప్రతి పది మీటర్ల లోతులో...

బోరు బిల్డింగ్ ద్వారా ప్రతి మీటర్ల లోతుకు ఒక మారు మట్టిని సేకరించి ప్రత్యేకంగా భద్రపరుస్తున్న తీరు మరింత అనుమానాలకు తావిస్తుందని చెప్పవచ్చును. పై గ్రామములోనే 2009 సంవత్సరంలో యురేనియం సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ అధికారులు రైతుల పొలాలలో బోర్లు వేసి మట్టి సేకరిస్తున్న సందర్భంలో ఆనాడు ఉద్యమంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు నల్లమల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. మరోసారి పై గ్రామములో మట్టిని సేకరిస్తున్న తీరుతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, బోరు డ్రిల్లింగ్ పనులను గ్రామస్తులు నిలిపివేశారు.

వాటర్ లెవలింగ్ లో భాగంగా...

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 17 వాటర్ షెడ్ పథకాలు కొనసాగుతున్నాయని నేషనల్ వాటర్ లెవలింగ్ అథారిటీ సూచనల మేరకు 17 వాటర్ షెడ్ ఏరియాలలో భూ అంతర్భాగం షీలా పొరలలో ఉన్న నీటి శాతాన్ని తెలుసుకునందుకే తిరుమలాపూర్ గ్రామంలో బోరు డ్రైవింగ్ ద్వారా మట్టి నమూనా సేకరణ చేపడుతున్నామని జిల్లా హోటల్ లెవలింగ్ అధికారిని రమాదేవి ఫోను ద్వారా తెలిపారు. ప్రతి పది మీటర్లకు ఒకసారి భూమి అంతర్భాగంలో గల రాతి పొరలలో ఏ మేరకు నీటి తేమ శాతం ఉందో తెలుసుకునేందుకు మట్టిని సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కల్వకుర్తి, వెల్దండ, చారగొండ తదితర మండలాలలో 28 బోర్లను డ్రిలింగ్ చేశామని, అందులో భాగంగా అమ్రాబాద్ మండలం తిరుమాలపూర్ గ్రామంలో నీటి అంతర్గత పరిశీలన ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తామన్నారు. అలాగే నేషనల్ హైడ్రాలజీ ద్వారా మరో 30 కొత్త బోర్లు డ్రిల్లింగ్ చేసి భూమి అంతర్భాగంలో నేటి సామర్ధ్యాలు తెలుసుకునేందుకు వాటర్ షెడ్ ప్రాంతాలు ఉన్న ప్రదేశాలలో బోరు డ్రిల్లింగ్ పనులు జరుగుతాయని తెలిపారు. స్థానిక ప్రజలకు గత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వారు భయాందోళన చెందుతున్నారని ముమ్మాటికి యురేనియం కోసం బోర్ డ్రిల్లింగ్ చేసి మట్టి నమూనా సేకరించడం లేదని జిల్లా వాటర్ లెవలింగ్ అధికారి రమాదేవి దిశకు వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక..

గతంలో యురేనియం తవ్వకాల పరిస్థితుల నేపథ్యంలో నల్లమల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. తదుపరి రాష్ట్ర ప్రభుత్వం కూడా నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టేదిలేదని అసెంబ్లీలో తీర్మానం చేసినా కూడా వివిధ సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి వివిధ సర్వేల రూపాలలో నల్లమల్లలో కలకలం రేపుతున్నారని యురేనియం జేఏసీ నాయకులు నాసరయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానంతో నల్లమల ప్రజలకు యురేనియం భయం పోయిందని భావిస్తున్న తరుణంలో మహారాష్ట్రకు చెందిన బోర్ డ్రిల్లింగ్ వాహనం ద్వారా వాటర్ లెవెలింగ్ పేరుతో మరోసారి భూగర్భంలో ఉన్న నిక్షేపాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టి ఏదైనా చేయాలని చూస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన హెచ్చరిక చేశారు.


Similar News