RTC RM : కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు

పేదల తిరుపతిగా,కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తున్న కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోలలోని

Update: 2024-10-29 15:41 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పేదల తిరుపతిగా,కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తున్న కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోలలోని 9 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి.శ్రీదేవి తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.ఈ నెల 31 నుంచి నవంబర్ 18 వరకు జరిగే జాతరకు మూడు రోజులు మొత్తం 179 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆమె తెలిపారు. ప్రధానంగా నవంబర్ 7 న 38 బస్సులు,8 వ తేదీ ఉద్దాల ఉత్సవం సందర్భంగా 103 బస్సులు,9 వ తేదీన 38 ప్రత్యేక బస్సులు అవిశ్రాంతంగా నడుస్తాయని ఆమె తెలిపారు. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రత్యేక బస్సులు నడిపిస్తామని,భక్తులు సురక్షిత ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

శబరిమలై కి ప్రత్యేక బస్సులు..

శబరిమలై వెళ్లే భక్తుల సౌకర్యార్థం అద్దె ప్రాతిపదికన సూపర్ లగ్జరీ బస్సులు సమకూర్చనున్నట్లు ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. బస్సులో టీవీ సౌకర్యం ఉంటుందని,ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట మనుషులకు,సామాన్లు సర్థేందుకు(సీటు లేకుండా)ఒక వ్యక్తికి ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు.అంతేకాకుడా బస్సు బుక్ చేసిన గురుస్వామి కి ఉచిత ప్రయాణం ఉంటుందని, ఒకటి కంటే ఎక్కువ బస్సులు అద్దెకు బుక్ చేసిన గురుస్వామికి ఆ బస్సులపై రోజుకు 300 రూపాయల కమీషన్ చెల్లిస్తామని, మిగతా వివరాలకు సమీప డిపో మేనేజర్లను సంప్రదించవచ్చని ఆర్ఎం వివరించారు.ఈ సమావేశంలో డిప్యూటీ ఆర్ఎం లక్ష్మీ ధర్మ,డిఎం సుజాత పాల్గొన్నారు.


Similar News