దేశంలోనే అత్యధిక వరి పంట పండింది తెలంగాణలోనే..

స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో పండని విధంగా, తెలంగాణలో లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని,ఇది ఇప్పటి వరకు ఉన్న జీవితకాల రికార్డు అని రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-11-29 14:44 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో పండని విధంగా, తెలంగాణలో లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని,ఇది ఇప్పటి వరకు ఉన్న జీవితకాల రికార్డు అని రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి అవుతున్న సందర్భంగా..ప్రజా పాలన విజయోత్సవాల నిర్వహణలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మూడు రోజుల రైతు పండగ,రాష్ట్ర ముఖ్యమంత్రి శనివారం పర్యటన ఏర్పాట్లను,రైతు స్టాళ్లను పరిశీలించి రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసి తెలంగాణ మొదటి స్థానం సాధించినందుకే,రైతులు పండుగ చేసుకుంటున్నారని అన్నారు. రైతులకు మంచి పంటలు పండాయని,ప్రభుత్వం సైతం దొడ్డు రకానికి మద్దతు ధరకు కొనుగోలు చేసి,సన్నరకం వరికి మద్దతు ధరతో పాటు..అదనంగా క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే ధాన్యం కొంటుందని మంత్రి తెలియజేశారు. రైతు పండగ ఏర్పాట్లు,స్టాళ్లు చాల అద్భుతంగా ఉన్నాయని ఇందుకు కారణం వ్యవసాయశాఖ మంత్రి అనుభవం,వారి దక్షత అని కొనియాడారు. రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుత్వం పూర్తిగా రైతు,వ్యవసాయం పక్షపాతి అని అన్నారు. గత పాలకులు రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటి అయిదు సంవత్సరాల్లో కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేసిందని,తర్వాత అరకొర రుణమాఫీ చేసి చేతులెతేసిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం18 వేల కోట్లతో 21 లక్షల మంది రైతుల రుణమాఫీ చేశామని,మిగిలిన కొంత మంది రైతుల రుణమాఫీ పై ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తారని మంత్రి తెలిపారు.

పామాయిల్ సాగుకు ప్రభుత్వమే పెట్టుబడి పెడుతుంది..

అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..రైతులకు ఏది మంచిగా ఉంటుందో సలహలివ్వాలని,వారి అభిప్రాయాల మేరకు,వారికి మేలు చేసే పథకాలనే కొనసాగిస్తామని అన్నారు. రైతులు పామాయిల్ సాగు చేయాలని, 4 సంవత్సరాలు పెట్టుబడి ప్రభుత్వమే భరిస్తుందని,ఈ నాలుగు సంవత్సరాలు పంట సాగు చేసి అత్యధిక లాభాలు పొందవచ్చన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేస్తామని,పామాయిల్ పంటను రైతు ఇంటివద్దనే కొంటామని రైతులకు పామాయిల్ సాగుపై భరోసా కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి త్వరగా పూర్తి చేయించాలని నీటి పారుదల మంత్రికి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.జి.చిన్నారెడ్డి,ఎమ్మెల్యే లు జి. మధుసుధన్ రెడ్డి,యెన్నం శ్రీనివాసరెడ్డి,అనిరుధ్ రెడ్డి,వీర్లపల్లి శంకర్,మేఘా రెడ్డి,వాకిటి శ్రీహరి,డా.వంశీ క్రిష్ణ,పర్ణికరెడ్డి,కసిరెడ్డి నారాయణరెడ్డి,రాష్ట్ర రైతు సంఘాల అధ్యక్షుడు కోదండ రెడ్డి,వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు,కమిషనర్ గోపి,రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్.చౌహాన్,జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి,శాస్త్రవేత్తలు,రైతులు పాల్గొన్నారు.


Similar News