మున్సిపాలిటీల్లో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి : కలెక్టర్

జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

Update: 2024-06-26 14:27 GMT

దిశ, కొత్తకోట : జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి కొత్తకోట మున్సిపాలిటీలో పర్యటించి పారిశుద్యాన్ని పరిశీలించారు. శానిటేషన్ సిబ్బంది హాజరుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పురపాలికల పరిధిలో ప్రధాన మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, చెత్త సేకరణ పకడ్బందీగా నిర్వహించాలని, మునిసిపల్ కమిషనర్లకు ఆదేశించారు. కాలువల్లో నీరు ఎక్కడా నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు.

కొత్తకోట పురపాలిక పరిధిలోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ప్రధాన కాలువల నిర్వహణ పై సిబ్బందికి సూచనలు చేశారు. శానిటేషన్ సిబ్బంది మురుగు కాలువలను శుభ్రపరచే సమయంలో గ్లౌస్, బూట్లు ధరించాలని చెప్పారు. పురాల్లో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కొత్తకోట పట్టణంలో ఉన్న నర్సరీని కలెక్టర్ పరిశీలించారు. నర్సరీలలో స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. నర్సరీలలో ఉన్న పెద్ద మొక్కలను అవసరమైనచోట నాటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్ ఏఈలకు సూచించారు. లే అవుట్లు, పార్కులు, వాకింగ్ వేలు సహా టౌన్ లో మొక్కలు నాటడానికి అనువైన ప్రాంతాలను గుర్తించి వేగంగా పూర్తి చేయాలన్నారు. కొత్తకోట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్మాణ చివరి దశలో ఉన్న యూత్ భవనాన్ని పరిశీలించి వారం రోజుల్లో మిగతా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఉన్న వారిలో జడ్పీ సీఈఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, ఇంజనీరింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Similar News