ఆరోగ్య మహిళ, కంటివెలుగు కార్యక్రమాలన్నీ డ్రామాలే..
మహిళల దినోత్సవం రోజున మాత్రమే అధికార పార్టీకి మహిళలు గుర్తుకొస్తారని, మిగతా రోజుల్లో.... RS Praveen kumar hits out at CM KCR
దిశ, వడ్డేపల్లి: మహిళల దినోత్సవం రోజున మాత్రమే అధికార పార్టీకి మహిళలు గుర్తుకొస్తారని, మిగతా రోజుల్లో కనీసం మహిళలను గౌరవించరని డా. ఆర్ఎస్ ప్రవీణ కుమార్ విమర్శించారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు గత నాలుగేళ్లుగా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. పైగా రూ. 4 వేల కోట్ల బకాయిలు ఉంటే, కేవలం రూ. 750 కోట్లు ఇవ్వడం అన్యాయం అన్నారు. ఆరోగ్య మహిళ పేరుతో మరోసారి మహిళలను మోసం చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. కంటివెలుగు, ఆరోగ్య మహిళ పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపడంలేదని విమర్శించారు.
బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నేడు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో పేదలు మరింత పేదలుగా మారారన్నారు. ఒక పక్క పేదలకు బాత్రూంలు కూడా లేవని, దొరలు మాత్రం 40 రూంలు ఉన్న ఇళ్లు కట్టుకున్నారని ఆరోపించారు. కానీ బహుజన రాజ్యంలో దొరలకే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని తెలిపారు. పేదలకు ఇవ్వాల్సిన డబ్బుతో కవిత లిక్కర్ స్కాంలో రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టిందని ఆరోపించారు. కవితకు అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. ఆమె పేద మహిళల వలె కూలీ పని చేయగలదా, నాట్లు వేయగలదా? అని అన్నారు.
రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ లో కనీసం మూడు చక్రాల వాహనం ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం బీఆర్ఎస్ అని విమర్శించారు. బహుజన రాజ్యంలో మహిళల పేరుతో ఎకరం భూమి పంచుతామని, 5 ఏళ్లలో మహిళలకు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ లో మాయావతి 7 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని తెలిపారు. మరియమ్మను చంపారని, ఖధీర్ ఖాన్ ను చంపి కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారని గుర్తు చేశారు. మహిళలకు సమాన న్యాయం రావాలంటే బీఎస్పీని గెలిపించాలని కోరారు. అందుకు అలంపూర్ నుండి ప్రారంభం కావాలని కోరారు. అలంపూర్ గడ్డ బహుజనుల అడ్డ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ క్వీన్, రాష్ట్ర మహిళా కన్వీనర్ ఆకినపల్లి శిరీష, జోనల్ కన్వీనర్లు కవిత, రాములమ్మ, రజిత, నియోజకవర్గ మహిళా నాయకురాలు అశ్విని, నాగజ్యోతి, జిల్లా అధ్యక్షులు కేశవరావు, నియోజకవర్గ నాయకులు మహేష్, కనకం బాబు, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.